జనగణనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

ప్రభుత్వ విప్‌,

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రతిఒక్కరూ జనాభా గణనలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆదివారం ఉదయం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియం కమాన్‌ వద్ద ‘హ్యాపీ సండే’ నిర్వహించారు. అలాగే యాప్‌ ద్వారా స్వీయ జనగణనకు సంబంధించిన నమోదును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో జనగణన ప్రక్రియ మరింత సులభతరమైందన్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం ద్వారా పారదర్శకత, వేగం పెరిగిందన్నారు. దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని, కచ్చితమైన డేటా ఆధారంగా ప్రభుత్వాలు సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అధికారులు ఇంటికి వస్తే సరైన సమాచారం ఇవ్వాలన్నారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా వెనకబాటుతనం, విద్యాస్థాయి, జీవన ప్రమాణాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. ఇక ‘హ్యాపీ సండే’లో భాగంగా చిన్నారుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, అదనపు కలెక్టర్‌ హరిప్రియ, నగర మేయర్‌ మమత, డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement