ఆరోగ్య పరుగు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య పరుగు

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన 64ఏళ్ల వయసులోనూ ఆరోగ్యం

రన్నింగ్‌తో ఆరోగ్యం

మే 3న జడ్చర్లలో పాలమూరు రన్‌

ఆరోగ్యకరమైన జీవనశైలికే అంటున్న నిర్వాహకులు

తెలంగాణ రన్నర్స్‌ సహకారంతో పాలమూరు రన్‌ పేరుతో 10కే రన్‌ నిర్వహిస్తున్నాం. మే 3న బాదేపల్లి జెడ్పీ హైస్కూల్‌లో తెల్లవారుజామున జుంబా డాన్స్‌, యోగ, ధ్యానంతో సభ ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలి గూర్చి ప్రముఖులు అవగాహన కల్పిస్తారు. రన్‌లో 2.5కె, 5 కే, 10కే ఉంటాయి. డిగ్రీ కళాశాల మైదానంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదులు చేసుకునేలా ఏర్పాట్లు చేశాం.

– గోపాల్‌, పాలమూరు రన్‌ నిర్వహకుడు, జడ్చర్ల రన్నర్స్‌ సభ్యుడు

నిత్యం రన్నింగ్‌ చేయటంతో 64 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ఇప్పటివరకు మారథాన్‌, 10కే, 5కే రన్‌లో పాల్గొన్నా. అందరు నాలా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతోనే పాలమూరు రన్‌ నిర్వహించేందుకు ముందుకొచ్చాం. నాలాంటి ఎంతోమంది తమ అనుభవాలను ఆరోజు పంచుకుంటారు. రన్నింగ్‌ చేయటంతో కలిగే ప్రయోజనాలు అందరు తెలుసుకోవడానికి పాలమూరు రన్‌ విజయవంత చేయాలి.

– రామకృష్ణ, జడ్చర్ల రన్నర్స్‌ సభ్యుడు

జడ్చర్ల టౌన్‌: తెలంగాణ రన్నర్స్‌ సహకారంతో జడ్చర్ల రన్నర్స్‌ మే 3న జడ్చర్లలో పాలమూరు రన్‌ నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు రన్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాధారణంగా మెట్రో నగరాల్లో మారథాన్‌, ఆఫ్‌మారథాన్‌, 10కే, 5కే రన్‌ పేరిట జాతీయ, అంతర్జాతీయ స్థాయి రన్‌లు నిర్వహిస్తుంటారు. హైదరాబాద్‌ రన్నర్స్‌ పేరిట హైదరాబాద్‌లో 40కిపైగా స్థానిక రన్నర్స్‌ ఏర్పాటు చేసుకు ని ప్రతివారం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి తరహాలోనే తెలంగాణ రన్నర్స్‌ పేరిట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకేంద్రాల్లో రన్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జడ్చర్లలో మే 3న పాలమూరురన్‌ నిర్వహించనున్నారు. రన్‌లో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా, నేరుగా జడ్చర్ల మినీ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నమోదులు చేసుకునేందుకు జడ్చర్ల రన్నర్స్‌ సదుపాయం కల్పించారు. ఇప్పటికే 400మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో 200మంది వరకు నమోదుకు అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు, హైదరాబాద్‌ నుంచి సైతం రన్నర్స్‌ పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్యులతో సలహాలు, యోగాతో కలిగే ప్రయోజనాలు వివరించనున్నారు. రన్నింగ్‌లో పాల్గొన్న వారికి టీషర్ట్‌, అల్పాహారం, రన్నింగ్‌ మధ్యలో స్నాక్స్‌ అందించనున్నారు.

రన్నింగ్‌తో గుండె ఆరోగ్యం మెరుగుపడటం, ఊపిరితిత్తులను బలపర్చటం, గుండె జబ్బు ల నివారణను 45శాతం తగ్గిస్తుంది. వేగంగా క్యాలరీలను కరిగించటంతో బరువు తగ్గటం, ఎముకల బలం పెరగటం, ఒత్తిడి తగ్గటం, ఒత్తిడిని తగ్గించి మానసికస్థితిని మెరుగుపర్చటం, రన్నింగ్‌తో ఆందోళనను తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. ప్రతిరోజు 5–10నిమిషాలు పరుగెత్తటంతో గుండె జబ్బుల వల్ల కలిగే మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పై అంశాలపై రన్‌లో అవగాహన కల్పించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement