డబుల్‌ బెడ్‌రూం కోసం మహిళ హత్య? | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్‌రూం కోసం మహిళ హత్య?

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

కన్న కూతురు, అల్లుడే హత్య చేశారని బంధువుల ఫిర్యాదు

జడ్చర్ల: డబుల్‌ బెడ్‌రూంలో కూతురు, అల్లుడితో కలిసి ఉంటున్న ఓ వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. పట్టణంలోని కావేరమ్మపేటకు చెందిన సాహిదాబేగం(80) తన కూతురు ఫహిమ్‌ ఉన్నీసాబేగం, అల్లుడు మహ్మద్‌ ఫాజిల్‌తో కలిసి నివాసం ఉంటుంది. అయితే కొన్నిరోజుల నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇంటిని తమకు ఇవ్వాలంటూ భార్యాభర్తలు గొడవ పడి ఆమైపె దాడి చేసి గాయపరిచినట్లు మృతురాలి మేనల్లుడు వాహిద్‌పాష తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 23న కూతురు, అల్లుడు కలిసి ఆమైపె దాడి చేసి గాయపరిచారని, మరుసటి రోజు 24న ఆమె మృతి చెందిందని సమాచారం వచ్చిందని ఆయన వివరించారు. దీంతో ఇంటి కోసమే కన్న తల్లిని హత్య చేసిన కూతురు, అలుడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి మేనల్లుడు వాహిద్‌పాష శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కొత్తకోట రూరల్‌: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలం అమ్మపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జలేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మోల్గరి హన్మంత్‌రెడ్డి(65) ఇంటి దగ్గర నీళ్ల మోటర్‌ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కొత్తకోటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. మృతుడి కుమారుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

జడ్చర్ల: జడ్చర్ల కొత్త బస్టాండ్‌ ఆవరణలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి(60) మృతి చెందినట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. బస్టాండ్‌ స్టేషన్‌ మేనేజర్‌ రవీంద్రనాథ్‌ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని జడ్చర్ల ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వనపర్తి రూరల్‌: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శనివారం పెబ్బేరు మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ–2 దివ్యారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెబ్బేరు మండల కేంద్రంలోని కొత్తకోట బైపాస్‌ దగ్గర కర్నూల్‌ వైపు వెళ్లే జాతీయ రహదారిపై జై గురుదత్తా దాబా సమీపంలో ఓ వాహనం శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తిని(42) ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పెబ్బేరు పట్టణ వార్డు ఆఫీసర్‌ గొల్ల అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

మక్తల్‌: ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌లో సిమెంట్‌ తీసుకొస్తుండగా ట్రాలీ అదుపు తప్పి ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మక్తల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచలింగాల్‌ భగవాన్‌పల్లి మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తా పడి భగవాన్‌పల్లికి వెంకటేష్‌ (57), తిమ్మప్ప తీవ్రగాయాల పాలయ్యారు. వెంకటేష్‌ను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తిమ్మప్ప కర్నాటక రాయచూర్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పిడుగుపడి యువకుడు మృతి

బల్మూర్‌: మండలంలోని మైలారం సమీపంలో శనివారం సాయంత్రం ఆకాల వర్షంతో పిడుగుపాటుకు గురై ఓ యువకుడితోపాటు గేదె మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టు సలేశ్వరం(19) శనివారం తన గేదెను మేపడానికి సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్లగా సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావండతో సమీపంలో ఉన్న తాటి చెట్టుకిందికి గేదెతోపాటు వెళ్లి తలదాచుకోగా.. పిడుగు పడి గేదెతోపాటు సలేశ్వరం అక్కడికక్కడే మృతిచెందాడు. వర్షం వెలిసిన తర్వాత గమనించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి వచ్చి పరిశీలించగా మృతిచెంది ఉండటంతో బోరున విలపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజేందర్‌ ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతుడి తల్లి చెన్నకిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడి తండ్రి ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందగా తల్లి, సోదరి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement