పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

కొల్లాపూర్‌ రూరల్‌: పోడు భూములకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పట్టాలిచ్చే వరకు గిరిజనులతో కలిసి పోరాటాలు చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండంలో ఆయన పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులతో కలిసి భూములను పరిశీలించారు. అనంతరం అక్కడ ఫారెస్టు అధికారులు పెడుతున్న ఇబ్బందుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న ఎకరం నుంచి 10ఎకరాల వరకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ముక్కిడిగుండంలో 70మంది రైతులు 300 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని అట్టివారికి వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ భూములకు కేఎల్‌ఐ ప్రాజెక్టు నుంచి సాగునీరు సరఫరా చేయాలని కోరారు. షెడ్యూల్డు ట్రై ప్రకృతి ఆరాధికులకు జనగణనలో ఒక కాలాన్ని పెట్టాలన్నారు. అనంతరం గిరిజన సంఘం కొల్లాపూర్‌ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, రాష్ట్ర ఉపాధ్యాక్షులు బాల్యనాయక్‌, సర్పంచ్‌ లాలి, మండలాధ్యక్షుడు శ్రీనునాయక్‌, తిరుపతినాయక్‌, గోపాల్‌నాయక్‌, బాల్‌నాయక్‌, హనుమంతు నాయక్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement