మహబూబ్‌నర్ ఎడ్యుకేషన్: న్యాయ విచారణలో ఆధారాలే కీలకం అని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. పీయూ లా కళాశాల ఆధ్వర్యంలో క్లూ ఫర్ ఎవిడెన్స్ సంస్థ సహకారంతో ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాయపరమైన విచారణలో భౌతికపరమైన, సాంకేతికపరమైన సాక్ష్యాల ద్వారా త్వరితగతిన కేసు విచారణ చేసేందుకు అవకాశం ఉంటుందని, వీటిపై విద్యార్థులు పూర్తిస్థాయిలో పట్టు సాధించాల్సిన అవసరం ఉందని, అప్పుడే న్యాయవాది వృత్తిపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకోసం పుస్తకపఠనం, ప్రాక్టీస్‌తోపాటు ఇలాంటి వర్క్‌షాప్‌లలో విద్యార్థులు పాల్గొని మంచి నైపుణ్యాన్ని సాధించాలని సూచించారు. క్లూ ఫర్ ఎవిడెన్స్ సంస్థ డైరెక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ న్యాయ విచారణలో ఎవిడెన్స్ అనేది అత్యంత కీలకమైన అంశమని, విద్యార్థులకు మాక్ డెమానిస్ట్రేషన్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, లీగల్ అప్లికేషన్ వంటి అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ మాళవి, వైస్ ప్రిన్సిపాల్ భూమయ్య, వెంకటసాయి ప్రసాద్, రాధాకృష్ణ, అనిల్‌సింగ్, అశోక్, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


