జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లావ్యాప్తంగా ఇసుక విధుల్లో ఉన్న జీపీఓలకు రక్షణ కల్పించాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల తహసీల్దార్ ఆదేశం మేరకు ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయడంలో భాగంగా విధుల్లో ఉన్న రంగాపూర్, కోడ్గల్ గ్రామాలకు చెందిన జీపీఓలపై కొంతమంది ఇసుక మాఫియా దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని పారిపోయారని ఆరోపించారు. దాడి చేసిన దుండగులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జీపీఓలకు రక్షణ కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ నాయకులు చంద్రనాయక్, దేవేందర్, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాలొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం
వహిస్తే చర్యలు
జడ్చర్ల టౌన్: అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ హెచ్చరించారు. శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, నర్సరీల నిర్వహణ, ఉపాధి హామీ లేబర్ సమీకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఉపాధి పనులకు కనీసం వందమంది కూలీలను సమీకరించాలని, నర్సరీ బెడ్స్‌లో మొక్కలు మొలకెత్తే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు మొదలు పెట్టని వాటిని త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఉద్యోగులు అందరూ సకాలంలో విధులకు హజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఏపీఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
దోమకాటుతో
అప్రమత్తంగా ఉండాలి
పాలమూరు: దేశవ్యాప్తంగా మలేరియాను 2030 వరకు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ అన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని కుమ్మరివాడీ అర్బన్ హెల్త్‌సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అనాథిలిస్ అనే దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుందని, జ్వరం, చలి, చెమటలు పట్టడం, ఒళ్లు నొప్పులు ఉండటం ఈ వ్యాధి లక్షణాలు అన్నారు. మలేరియా రక్త పరీక్షల ద్వారా వ్యాధి పాజిటివ్ అనేది నిర్ధారణ చేయవచ్చని వెల్లడించారు. దోమల సంతతి పెరగకుండా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వేసవిలో బయట నిద్రించే వారు తప్పక దోమ తెరలు వాడాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. జ్వర లక్షణాలు కనిపిస్తే స్థానిక పీహెచ్‌సీల్లో చికిత్స తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి విద్య, మెడికల్ ఆఫీసర్ తస్లీమా ఫర్హాత్, హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నాగరాజుశెట్టి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


