జడ్చర్ల టౌన్: వందేళ్లపాటు గుర్తుండేలా జడ్చర్ల కోర్టు భవనాల సముదాయం నిర్మించుకుందామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. శనివారం ఆమె జడ్చర్ల జూనియర్ సివిల్‌కోర్టును సందర్శించి.. కోర్టు కోసం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థలం ప్రస్తుత కోర్టు సముదాయాల ప్రహరీకి ఆనుకుని ఉండటాన్ని న్యాయవాదులు వివరించారు. జాతీయరహదారి–167కి ఆనుకుని స్థలం రావడంతో ప్రధాన ద్వారం అక్కడ నిర్మించాలని కోరారు. అనంతరం కోర్టుకు చేరుకుని భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. అన్ని గదుల్లోనూ వర్షపు నీరు వస్తుందని, దీంతో బార్ అసోసియేషన్ కోసం నిర్మించిన భవనాన్ని అదనపు కోర్టు కోసం కేటాయించి.. తాము చిన్నపాటి గదిలో నిర్వహణ సాగిస్తున్నామని న్యాయవాదులు వివరించారు. ఆ తర్వాత కోర్టు హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదిరెడ్డి, న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి కోర్టులో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ స్థల పరిశీలన కోసం వచ్చానని, అయితే భవనం మంజూరు విషయంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోర్టు భవనాల నిర్మాణాలకు ఒకే రకమైన డిజైన్ ఉంటుందని, జడ్చర్ల కోర్టు అదే తరహాలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్టులు వచ్చినా ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేసుకుందామన్నారు. కోర్టుకు వచ్చిన న్యాయమూర్తికి న్యాయమూర్తి నీహారిక, అదనపు కోర్టు న్యాయమూర్తి ముదసిర్ స్వాగతం పలికారు. ఆమె పర్యటన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.


