నేడు ప్రపంచ వెటర్నరీ దినోత్సవం
● సమాజ ఆరోగ్యంలోనూ కీలక పాత్ర
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): గ్రామీణ జీవనానికి అండగా నిలిచే పశుసంపదను కాపాడేవారు.. రైతు కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి బలంగా నిలిచేవారు.. మనం నిత్యం వినియోగించే పాలు, గుడ్లు, మాంసం వంటి ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించే వారే వెటర్నరీ వైద్యులు. కనిపించకుండా సేవలు అందిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్న ఈ అజ్ఞాత సైనికుల సేవలు అపారమైనవి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం నిర్వహించే ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
రైతు–జీవాలు–ప్రజారోగ్యం
జంతు సంరక్షణ అంటే కేవలం పశువుల వైద్యం మాత్రమే కాదు.. ప్రజారోగ్యానికి కూడా సంబంధించిన అంశం. పశువుల్లో వ్యాధులు వ్యాపించకుండా అరికట్టడం ద్వారా మానవులకు వచ్చే అంటువ్యాధులను నివారించడం కూడా వీరి బాధ్యతలో భాగమే. ఒక ఆరోగ్య సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు చేస్తూ పశు, మానవ ఆరోగ్యాన్ని సమాంతరంగా కాపాడుతున్నారు పశు వైద్యులు.
జిల్లాలో విస్తృత సేవలు
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాలీక్లీనిక్‌లు, పశువైద్యశాలలు నిర్వహిస్తూ రైతులకు చేరువవుతున్నారు. గ్రామ స్థాయిలోనే చికిత్సలు అందిస్తూ అత్యవసర సమయాల్లో పశువులను రక్షిస్తున్నారు. జిల్లా జాయింట్ డైరెక్టర్‌తో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, 27 మంది పశువైద్యులు, 52 మంది పాలీ సిబ్బంది, 60 మంది అటెండర్లు కలిసి సమన్వయంతో పని చేస్తున్నారు. వీరంతా గ్రామీణ స్థాయిలోనే పశువులకు టీకాలు, క్రిమినాశన చర్యలు, గర్భధారణ సేవలు, పోషణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు ఉచిత యాంటీరేబీస్ టీకాలు వేస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తమ పరిధిలో టీకాల నమోదు, పర్యవేక్షణ, నివేదికల సమర్పణ వంటి చర్యలను క్రమబద్ధంగా కొనసాగిస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువులను సంరక్షణపై చర్యలు తీసుకుంఉటన్నారు.
ఫర్మ్ నుంచి ఫుడ్ వరకు..
పశువుల ఆరోగ్యం బాగుంటేనే మనకు సురక్షిత ఆహారం అందుతుంది. పాలు, మాంసం, గుడ్ల నాణ్యతను కాపాడడంలో వెటర్నరీ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫర్మ్ టు ఫోర్క్ విధానంలో ఆహార భద్రతను కాపాడడంలో వెటర్నరీ వైద్యుల పాత్ర కీలకం.
జిల్లా గోజాతి గేదె జాతి గొర్రెలు మేకలు కుక్కలు పిల్లులు
మహబూబ్‌నగర్ 89,500 79,102 8,01,847 1,13,798 10,200 1,000
జో,గద్వాల 56,298 52,124 5,77,444 66,817 9,300 390
నాగర్‌కర్నూల్ 2,39,523 1,06,373 6,62,717 1,95,745 14,917 1,200
జిల్లాల వారీగా పశుసంపద ఇలా..
ఫర్మ్ నుంచి ఫుడ్ వరకు వెటర్నరీల సేవలు
పశువుల ఆరోగ్యం అంటే రైతు ఆర్థిక భద్రత మాత్రమే కాదు, సమాజ ప్రజారోగ్యానికి కూడా ఎంతో కీలకం. జిల్లాలో పశువైద్య సేవలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. టీకాల పంపిణీ, వ్యాధి నిరోధక చర్యలు, మొబైల్ వెటర్నరీ సేవల ద్వారా రైతులకు సమయానుకూలంగా సేవలు అందిస్తున్నాం. వన్ హెల్త్ దృక్పథంతో పశు–మానవ ఆరోగ్యాన్ని సమాంతరంగా చూసే విధానాన్ని అమలు చేస్తున్నాం. రైతులు కూడా పశువుల సంరక్షణలో జాగ్రత్తలు పాటిస్తూ, టీకాలు తప్పనిసరిగా వేయించాలి.
– డాక్టర్ మధుసూదన్‌గౌడ్,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
ఆర్థిక వ్యవస్థకు అండ
పశుసంపద రైతు కుటుంబాల ఆదాయానికి ప్రధాన వనరు. ఒక పశువు అనారోగ్యం పాలైతే కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అలాంటి సమయంలో వెటర్నరీ వైద్యులు వేగంగా స్పందించి పశువులను రక్షించడం ద్వారా రైతు నష్టాలను తగ్గిస్తున్నారు.


