ధరూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు.. కేటీదొడ్డి మండలం కొండాపురానికి చెందిన హరిజన గోవిందు(50) శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో బైకుపై ధరూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండల పరిధిలోని జాంపల్లి– కోతుతగిద్ద గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించగా మృతి చెందిన వ్యక్తి గోవిందుగా గుర్తించారు. మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నందికర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు, బైకు ఢీ.. యువకుడి మృతి
మహమ్మదాబాద్: వెనుక నుంచి ఆర్టీసీ బస్సును బైకుతో ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చింతలకుంట తండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్ శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని మొకర్లాబాద్ స్టేజీ వద్ద వెళ్తుండగా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా రోడ్డుపై ఆపడంతో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆస్పత్రిలో అవసరాల కోసం రూ.50 వేలు కోస్గి తీసుకెళ్తున్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారిపై నిలపడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన టీఎస్06యూడీ9432 నంబర్ గల ఆర్టీసీ బస్సు సిబ్బందిని మాత్రం ఎలాంటి విచారణ చేపట్టకుండా వదిలేసినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చెట్టును ఢీకొట్టిన కారు.. వృద్ధురాలు మృతి
● అడవి పందులు అడ్డురావడంతో ప్రమాదం
బిజినేపల్లి/పానగల్: మండలంలోని మహదేవునిపేట సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పానగల్‌కు చెందిన ధర్మకారి దేశ్‌బాయి(79) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. పాన్‌గల్‌కు చెందిన దేశ్‌బాయి, ఆమె కుమారుడు ఈశ్వర్‌లాల్, రేణుకబాయి బిజినేపల్లి నుంచి పాన్‌గల్‌కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో మహాదేవునిపేట గ్రామ సమీపంలో అడవి పందుల గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాటిని తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో దేశీబాయి మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు 108లో గాయపడిన వారిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. శుక్రవారం స్వగ్రామంలో దేశ్‌బాయి అంత్యక్రియలు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అదుపుతప్పినబైక్.. వ్యక్తి మృతి
అలంపూర్: అలంపూర్ ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పూర్తి వివరాలు.. పట్టణంలోని న్యూప్లాట్స్‌కు చెందిన మహ్మద్ రఫి(34) ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 23న రాత్రి కర్నూలు నుంచి అలంపూర్‌కు బైక్‌పై వస్తుండగా ఇమాంపురం సమీపంలోని ఐదు మోరీల మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఆసిఫ్‌జా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కారు బోల్తా మహిళ మృతి
కల్వకుర్తి రూరల్: మండలంలోని తురకలపల్లి సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో తుమ్మోజు పార్వతమ్మ (54) మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతంలో నివాసం ఉండే పార్వతమ్మ కుమారుడు హరీష్ వివాహ పత్రికలను నాగర్‌కర్నూల్‌లో ఉండే బంధువులకు ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తురకలపల్లి గేట్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సునీల్ రెడ్డి తో పాటు హరీష్‌కు గాయాలు కాగా పార్వతమ్మకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. సునీల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.


