బీసీల రాజ్యాధికారానికి పెరిగిన మద్దతు | - | Sakshi
Sakshi News home page

బీసీల రాజ్యాధికారానికి పెరిగిన మద్దతు

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

● ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ముసుగేసి డీలిమిటేషన్‌తోపాటు ప్రవేశపెట్టారని, ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందన్నారు. దాన్ని అమలు చేయకుండా కుట్రలు చేయడం తగదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు తీరని నష్టం చేసి దీర్ఘకాలంగా అధికారాన్ని చెలాయించే కుట్రను పార్లమెంటులో ఓడించడం సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు.

● సీనియర్‌ జర్నలిస్టు యాదగిరి మాట్లాడుతూ.. 2056వరకు డీలిమిటేషన్‌ ఫ్రీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేష్‌ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధికంగా సీట్లు పెరిగే అవకాశముందని, దక్షణాది రాష్ట్రాల్లో జనాభాను కంట్రోల్‌ చేసి, ఉత్తరాది రాష్ట్రాలకు రివార్డులు ఇవ్వడం సరికాదన్నారు. చంద్రబాబు, పవన్‌ బానిసలుగా ఉంటారా ప్రజల పక్షాన కోట్లాడుతారో తేల్చుకోవాలన్నారు.

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కట్టుబడి ఉందని, బీసీల రాజ్యాధికారానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘13వ రాజ్యాంగ సవరణ బిల్లు–పూర్వాపరాలు’ అంశంపై జిల్లా కేంద్రంలోని బృందావన్‌ గార్డెన్స్‌లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్‌లోనే ఓబీసీ రిజర్వేషన్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. 2023లోనే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన మహిళా బిల్లును తిరిగి డీలిమిటేషన్‌ బిల్లుతోపాటు పెట్టి తన కుటీల ప్రయత్నాన్ని చాటుకుందని బీజేపీపై మండిపడ్డారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్రలు చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ రిజర్వేషన్‌కు చిత్తశుద్దితో ఉందని, డీలిమిటేషన్‌లో పార్లమెంటు సీట్ల పెంపు అనంతరం మళ్లీ 25ఏళ్ల వరకు దీనిపై ఆలోచించే పరిస్థితి ఉండదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు దేశంలో పరిణామాలపై ఆలోచించి అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు.

రౌండ్‌టేబుల్‌ సమావేశంలోప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, వక్తలు

Advertisement
 
Advertisement
Advertisement