● ఎమ్మెల్యే జీఎంఆర్‌కు మాజీ ఎమ్మెల్యే ఆల సవాల్
దేవరకద్ర: ‘ప్రజల తీర్పును గౌరవించి మొదట్లో ఏమి అనలేదు. మా మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అడ్డగోలుగా గౌరవం లేకుండా మాట్లాడితే ప్రజలు మెచ్చుకోరు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. స్థాయికి మించి మాట్లాడొద్దు, నల్లమట్టి అమ్ముకోలేదని కురుమూర్తిస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా. నువ్వు అక్కడి రా 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని సంతకం చేసి రాసిన బాండును బయటపెడతాం. కురుమూర్తి స్వామి ఎవరిని శిక్షిస్తారో చూద్దాం.’ అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం దేవరకద్రలో ఆయన మాట్లాడుతూ.. ‘మళ్లీ పోటీ చేస్తే 50 వేల ఓట్లతో గెలుస్తా అంటున్నావు. అయితే రాజీనామా చేసి రా పోటీ చేయడానికి నేనూ సిద్ధమే. ఒకవేళ నేను ఓడిపోతే రాజకీయ సన్యాయం తీసుకుంటా’ అని తెలిపారు. సివిల్ ఇంజనీరుగా సొంతంగా ఆలోచించి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించానని, పెద్దవాగు ఊకచెట్టు వాగులపై 36 చెక్ డ్యామ్‌లను నిర్మాణం చేసి రెండు వాగులను సజీవంగా నిలిపినట్లు పేర్కొన్నారు. కరివెన రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్‌లో లేకున్నా.. తాను సొంతంగా అక్కడ తిరిగి రిజర్వాయర్ నిర్మాణం చేయవచ్చని కేసీఆర్‌ను ఒప్పించామని తెలిపారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఇంటిగ్రేటేడ్ స్కూల్ స్థలం మార్చాలని అడిగిన వారిపై కేసు పెట్టి జైలులో వేశాడని ఆరోపించారు. పదేళ్ల క్రితం ఉన్న కేసులు బయటకు తీసి జైలుకు పంపిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన వెంట ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా భవిష్యత్‌లో ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కరివెన ప్రాజెక్టు పెండింగ్ పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎర్రమట్టి, నల్లమట్టి లేకుండా రిజర్వాయర్ నిర్మాణం సాధ్యం కాదు.. నీ తెలివి తేటలతో చేయగలిగితే చేయండి ఎట్లా చేస్తావో చూస్తామన్నారు. చేస్తే అభినందిస్తామన్నారు. నీ తమ్ముడు చెక్ డ్యామ్‌లు కడితే అప్పుడే కొట్టుకుపోయాయని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక దందా జోరుగా సాగుతుందని, ప్రతి బండికి ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.వంద కోట్లతో కొల్లూరులో ఎలా కొన్నావు, కూకట్‌పల్లిలో ఏం చేస్తున్నావో తెలుసన్నారు. భాష మార్చుకోకపోతే వీడియోలు బయటికి వస్తాయని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నాయకులు జట్టి నర్సింమారెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, మోహన్‌గౌడ్, బసిరెడ్డి, నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


