చోరీ కేసు ఛేదన.. ఇద్దరు దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసు ఛేదన.. ఇద్దరు దొంగల అరెస్ట్‌

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: పట్టణంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు రూరల్‌ సీఐ గాంధీనాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి చోరీ ఘటన వివరాలు వెల్లడించారు. నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్యామ్‌సుందర చారి జోషి ఈ నెల 4న కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లి ఈనెల 5న తిరిగి వచ్చారు. తిరిగొచ్చేసరికి దొంగలు ఇంటి తాళంతో పాటు బీరువా తాళం పగలకొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా జడ్చర్ల బస్టాండ్‌లో ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుంటే అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులు కర్ణాటకకు చెందిన కిరణ్‌ పాటిల్‌ అలియాస్‌ బాక్సర్‌ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుంటాడని అలాగే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ షేక్‌ బైకులు దొంగతనం చేసి ఇద్దరు వేరు వేరు కేసుల్లో చర్లపల్లి జైలుకు వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారి చోరీలకు పాల్పడేవారు. మహ్మద్‌ షేక్‌ తల్లికి గుండె ఆపరేషన్‌ ఉందని దీనికి డబ్బులు కావాలని కిరణ్‌ పాటిల్‌కు చెప్పగా దొంగతనాలు చేయడానికి అవసరం అయిన కిట్‌ (టూల్స్‌), రెండు కత్తులు, తిరగడానికి కాటేదాన్‌లో ఒక బైక్‌ దొంగతనం చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వచ్చి ఈనెల 4న శ్యామ్‌సుందర్‌ చారి జోషి ఇంట్లో నాలుగు తులాల బంగారం, డబ్బు, వెండి వస్తువులు అపహరించారు. దొంగతనం చేసిన బంగారాన్ని మరో వ్యక్తి మహ్మద్‌ సొహెల్‌ ఖాన్‌ పేరు మీద ముత్తూట్‌ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.2 లక్షలు తీసుకొని ఖర్చులకు వాడుకున్నారు. మరి కొంత బంగారం, వెండి వస్తువులను హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించారు. మళ్లీ దొంగతనం చేయడానికి జడ్చర్ల బస్టాండ్‌లో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏ1 కిరణ్‌ పాటిల్‌, ఏ2 మహ్మద్‌ షేక్‌లను అరెస్టు చేయగా ఏ3 మహ్మద్‌ సొహెల్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీఎస్‌ సీఐలు నాగర్జున్‌గౌడ్‌, కృష్ణ ఎస్‌ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement