● అనుమానితుడిగా ఒకరిపై కేసు నమోదు
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన పోలీసులు
రాజోళి: తీగలాగితే డొంక కదలాలి.. కాని ఇన్నిరోజులుగా వాస్తవాలను దాచినవారు ప్రస్తుతం విషయాలు బయటకు చెబుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ముండ్లదిన్నెలో అమాయక యువతిపై జరిగిన అఘాయిత్యంపై ‘సాక్షిశ్రీలో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. గురువారం నుంచే విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో బాధిత యువతి మతిస్థిమితం లేని కారణంగా ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామంలో కూడా చేసిన విచారణలో తెలిసిన వివరాల మేరకు ఒకరిపై అనుమానితుడిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోకారి తెలిపారు. బాధిత యువతి సోదరుడు మల్లి ఫిర్యాదు మేరకు ఒకరిపై అనుమానితుడిగా కేసు నమోదు చేశామని, ఇంకా విచారణ సాగుతుందని తెలిపారు.
డొంక కదులుతుందా?
ఘటనకు సంబంధించి ‘సాక్షిశ్రీలో కథనం వచ్చాక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్లు తెలస్తుంది. ఈ కారణంగానే ఒక్కరిపై అనుమానితుడిగా గుర్తించి తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుమానితుడిగా ఉన్న వ్యక్తే మిగతావారి పేర్లు చెబుతారనే అనుమానాలు వారిలో వెంటాడుతున్నాయి. ఘటనపై గ్రామపెద్దలు నిజంగానే పంచాయితీ పెట్టారా? ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళను శుక్రవారం సఖి కేంద్రానికి తీసుకెళ్లి స్టేట్‌మెంట్ తీసుకున్న అనంతరం పోలీసులు అనుమానితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ‘సాక్షి’ కథనం అనంతరం జరుగుతున్న పరిణామాలను చూస్తే అమాయక యువతిని లొంగదీసుకున్న వారిలో మరికొందరు ఉన్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి.


