జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమం అమలుపై కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఆ పథకాల లబ్ధి ప్రజలకు సమర్థంగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అధికారులు బాధ్యతతో పని చేస్తూ, తమ శాఖల పరిధిలోని సమస్యలను వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని కోరారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో ప్రతిరోజు సేకరించే సుమారు 100 మెట్రిక్ టన్నుల చెత్త వల్ల మీథేన్, రసాయనాల ప్రభావంతో ప్రజల కు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి పరిష్కారంగా బయో మైనింగ్ చేపట్టేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు సూచించారు. మురుగు నీటి పారుదల కోసం మంజూరైన మూడు ఎస్‌టీపీల పనులను త్వరితగతిన ప్రారంభించాలని, అవసరమైన స్థల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నగరంలోని పార్కులపై ఆక్రమణలను గుర్తించి, వాటిని రక్షించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, పీహెచ్‌సీలు మరియు అర్బన్ పీహెచ్‌సీలలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సమావేశం అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు


