భూత్పూర్: మండలంలోని అన్నాసాగర్ వద్ద భారతమాల రహదారి పనుల సర్వేను రైతులు గురువారం అడ్డుకున్నారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా మండలంలోని పోతులమడుగు, అన్నాసాగర్ శివారు నుంచి అన్నాసాగర్, తాటికొండ గ్రామ శివారు గుండా రాయచూర్ జాతీయ రహదారిని కలిపేందుకు భారతమాల చేపడుతున్నారు. దాదాపు వంద ఎకరాలకు పైగా భూములు కోల్పోతుండటంతో రహదారి పనుల సర్వేను అడ్డుకున్నట్లు తెలిపారు. ఏ ఏ గ్రామాల రైతుల భూములు కోల్పోతున్నారు, ఎంత కోల్పోతున్నారని, వారికి వచ్చే పరిహారం కోసం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశంతో సర్వే పనులు చేస్తుండగా పలు పర్యాయాలు రైతులు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ కిషన్ తెలిపారు. వారం రోజుల వ్యవధి కావాలని రైతులు తెలిపినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్నాసాగర్ సర్పంచ్ ఆల శ్రీకాంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


