విద్యుదాఘాతానికిలైన్‌మన్‌ బలి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికిలైన్‌మన్‌ బలి

Apr 24 2026 7:38 AM | Updated on Apr 24 2026 7:38 AM

అయిజ: గాలివానకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాను మెరుగుపరిచేందుకు విధులు నిర్వహిస్తున్న లైన్‌మన్‌ విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మల్లేష్‌ కథనం ప్రకారం.. మండలంలోని మేడికొండకు చెందిన శ్రావణ్‌కుమార్‌ (35) 2017నుంచి గ్రేడ్‌–2 ఆర్టిజన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈదురు గాలులకు విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్‌ పునరుద్ధరణకు చిన్నతాండ్రపాడు శివారులోని చిన్నమ్మ చెరువువద్ద వైర్లను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనతోపాటు హెల్పర్లు రాజు, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వారు కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక విద్యుత్‌శాఖ అధికారులతోపాటు ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య ఉంది. ఈ ఘటనతో విద్యుత్‌ శాఖ అధికారులను కలిచివేసింది. చిన్నతాండ్రపాడులో ఘటనతో విషాదం అలుముకుంది.

నిచ్చెన నుంచి జారి పడి వ్యక్తి మృతి

చిన్నంబావి: నిచ్చెన దిగుతూ అదుపు తప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దగడపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. దగడపల్లికి చెందిన వెంకటయ్యచారి (45) తన ఇంటి వద్ద రేకులు బిగించడానికి మిద్దె పైకి ఎక్కాడు. అనంతరం కిందకి దిగుతున్న క్రమంలో అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

నీటి బకెట్‌లోపడి చిన్నారి మృతి

లింగాల: సరదాగా ఆడుకుంటూ నీటి బకెట్‌ వద్దకు వెళ్లిన ఓ చిన్నారి అందులో పడి మృతిచెందిన విషాధకర ఘటన గురువారం మండలంలోని అప్పాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకుంట మల్లేష్‌, విజయ దంపతులకు మీనాక్షి(18నెలలు) కూతురు మధ్యాహ్న సమయంలో తల్లి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లగా.. ఇంట్లో కుటుంబ సభ్యులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో అన్నం తిన్న చిన్నారి చేతులు కడుక్కోవడానికి బాత్రూంలో ఉన్న బకేటు వద్దకు వెళ్లి బకెట్టులో ప్రమాదవశాత్తు బోర్ల పడింది. బయటకు వెళ్లిన చిన్నారి ఇంకా రాలేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై బయటకు వెళ్లి చూడగా చిన్నారి అప్పటికే మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. ఉన్న ఒక్క కూతురు నీటిలో పడి చనిపోవడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.

వివాహిత

అనుమానాస్పద మృతి

కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మున్సిపాలిటీలోని 5వ వార్డు ఎర్రగుట్టతండాలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగట్టుతండాకు చెందిన సబావట్‌ కవిత (30)పై అనుమానంతో భర్త వస్యానాయక్‌ నిత్యం వేధించేవాడు. బుధవారం రాత్రి సైతం కవితను వస్యానాయక్‌ కొట్టాడని, ఈ క్రమంలో ఆమె మృతి చెందినట్లు తెలిసిందన్నారు. మృతురాలి తల్లిదండ్రులు గురువారం ఉదయం వచ్చి కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement