100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Apr 24 2026 7:38 AM | Updated on Apr 24 2026 7:38 AM

బిజినేపల్లి: మండలంలోని లట్టుపల్లిలో ఒక ఇంటిలో అనుమానస్పదంగా నిల్వ చేసిన 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌పోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ హేమ్లానాయక్‌కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక ఆర్‌ఐ బాలరాజ్‌, పోలీసులతో కలిసి లట్టుపల్లిలోని ఓ ఇంటిలో గురువారం సాయంత్రం అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక డీలర్‌ రేషన్‌ దుకాణానికి సమీపంలో ఒక ఇంటిలో అనుమానస్పదంగా నిల్వ చేసిన 100 క్వింటాళ్లను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అనుమానం ఉన్న ఇతర డీలర్ల దుకాణాల్లోనే అధికారులు తనిఖీలు నిర్వహించారు. బిజినేపల్లి గోదాం నుంచి వచ్చిన బియ్యం, పంపిణీ, రేషన్‌ షాపులో ఉన్న నిల్వలతో పాటు, అనుమానస్పదంగా నిల్వ ఉంచిన వాటిని సరిపోల్చి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మూడు నెలల బియ్యం రావడంతో..

మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి రేషన్‌ షాపు రావడంతో అక్కడ నిల్వ సామర్థ్యం లేక గన్నీ సంచులతో సహ మరో ఇంటి వద్ద నిల్వ చేసినట్లు డీలర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే గ్రామానికి చెందిన లబ్ధిదారుల నుంచి డీలర్‌ రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బయట అధిక ధరలకు అమ్ముకుంటున్నారని బీజేపీ నాయకుడు భూషయ్య ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఒక్కసారిగా గన్నీ సంచులతో 100 క్వింటాళ్ల బియ్యం పట్టుబడటంతో అవి అక్రమ నిల్వలా.. లేదా గోదాంలో నిల్వ సామర్థ్యం లేక మరో చోట ఉంచారా అనే విషయంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement