మక్కలు.. తిప్పలు | - | Sakshi
Sakshi News home page

మక్కలు.. తిప్పలు

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో అరకొరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో పాటు అవసరం మేరకు కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. ఉన్న కొద్దిపాటి కేంద్రాలకే రైతులు పెద్దసంఖ్యలో వస్తుండటం, పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు చేతులెత్తేస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

పక్షం రోజులైనా కొలిక్కిరాని కొనుగోళ్లు..

ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట చేతికొచ్చి సుమారు నెలరోజులు అవుతోంది. ఈసారి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కొనుగోళ్లు ఊపందుకోలేదు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ జిల్లాలో నర్వ మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్టు చెబుతున్నా ఇప్పటివరకు ఒక బస్తా కూడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 24 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 50 వేల మెట్రిక్‌ టన్నులకు ఇప్పటివరకు కొన్నది 760 బస్తాల మొక్కజొన్న మాత్రమే. వనపర్తి జిల్లాలో 30 వేల మెట్రిక్‌ టన్నులకు గానూ కేవలం వెయ్యి మెట్రిక్‌టన్నులు, జోగుళాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 8,500 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశారు.

అరకొర కేంద్రాలతో అవస్థలు..

ప్రధానంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు అరకొరగా కేంద్రాలను ఏర్పాటుచేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈసారి అత్యధికంగా 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. కనీసం మండలానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 13 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో కూడా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంకాలేదు. నారాయణపేట జిల్లాలో కేవలం ఒక్కటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, జోగుళాంబ గద్వాలలో 7, వనపర్తి జిల్లాలో 4, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జాతీయస్థాయిలో సత్తా

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని గ్రామాలకు పునరావాసం కల్పించడంపై నమూనా ప్రజెంటేషన్‌లో ప్రతినిధులు సత్తాచాటారు.

–8లో u

Advertisement
 
Advertisement
Advertisement