ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్‌ దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్‌ దౌర్జన్యం

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఆర్టీసీ కార్మికుల సమ్మైపె కాంగ్రెస్‌ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందని, దీనిని తట్టుకోలేక వరంగల్‌లో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. గురువారం తన నివాసంలో మాజీమంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తాండూరులో ఆర్టీసీ కార్మికులకు టెంట్లు ఇస్తే టెంట్‌హౌస్‌ ఓనర్లకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఆర్టీసీ కార్మికులు కొత్తగా డిమాండ్లు అడగడం లేదని.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుతున్నారన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఆర్టీసీకి బకాయి పడిన రూ.1,400 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు యూరియా దొరకడం లేదని, కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదని, రైతుబంధు ఇవ్వడం లేదు.. పండించిన పంట కొనడంలేదని ఆరోపించారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోలేదని పేల్చారనే అనుమానం ఇంజనీర్లు వ్యక్తం చేశారన్నారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ పేరుతో అనవసరంగా ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. రెండు పిల్లర్లు కుంగితే ఎల్‌అండ్‌టీ సంస్థ మరమ్మతులు చేస్తామని చెప్పినా రాజకీయం చేయాలని మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. ఆర్‌ఎస్పీ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్‌ కేసులు రేవంత్‌రెడ్డి మీద ఉన్నాయన్నారు. చిత్తనూర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ద్వారా కాలుష్యం వస్తుందని, దాని పక్కన గురుకుల పాఠశాల ఏర్పాటు చేయవద్దని కోరితే సంతోష్‌రెడ్డి మీద తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. అదే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. దేవరకద్రలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, యాదయ్య, నర్సింహులు, వెంకన్న, కుర్వసత్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement