● మార్చి 22న రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓ పిచ్చి కుక్క చేసిన స్వైర విహారంతో ఆస్పత్రికి వచ్చిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. క్యాజువాలిటీ, ఎంసీహెచ్ భవన్ ఎదుట ఉన్న ఎండీ ఇమ్రాన్, ఆరేళ్ల చిన్నారి ఫైజా, ఫర్హా జబీర్, వెంకటయ్య, రాయప్ప, మరో గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది.
● మార్చి 23న నగరంలోని గోల్ మజీద్ ఏరియాలోని సోఫియా మజీద్ ఎదురుగా ఇంటి ఎదుట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై కుక్క దాడి చేసింది. వీరిని జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించడంతో పాటు డాగ్ బైట్ టీకాలు ఇప్పించారు. అదే ఏరియాలో ఆరు నెలల క్రితం ఒకే కుక్క దాదాపు 40 మందిపై దాడి చేసి గాయపరిచింది. ఇలా నగరంలో చాలా కాలనీల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో పిల్లలను బయటికి ఒంటరిగా పంపించడానికి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది.
పాలమూరు: వీధి కుక్కలు బెడదతో ప్రజలు బెంబేలేత్తుతున్నారు.గుంపులు, గుంపులుగా తిరుగుతూ వీధుల్లో జనాలను వెంబడిస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలన్నా..విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి రావాలన్నా తల్లిదండ్రుల గుండెల్లో వణుకు పుడుతోంది. ప్రజలు ఇంట్లోంచి కిరాణాషాపులకు, ఇతర పనులకు, కూలీకి వెళ్లాలన్న భయపడుతున్నారు. ఇక రాత్రి పూట రోడ్లపై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 22 వరకు 980 వాయిల్స్ చొప్పున 6వేల మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నారంటే జిల్లాలో కుక్కకాటు బాధితులు ఏవిధంగా పెరుగుతున్నారో అర్థం అవుతుంది. జిల్లాలో ప్రతి రోజు గ్రామ సింహాల బారినపడి రోజుకు సగటున 30 నుంచి 50 మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు.
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 14 వేల వరకు వీధి కుక్కలున్నాయి. కార్పొరేషన్ సిబ్బంది నిత్యం పది నుంచి 12 కుక్కలను పట్టుకుని స్థానిక మౌలాలి గుట్టలోని యానిమల్ బెర్ట్ కంట్రోల్(ఎంబీసీ)సెంటర్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. అక్కడ ఇనుప జాలీలలో 150 నుంచి 180 వరకు వీధి కుక్కలను ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2,678 కుక్కలను పట్టుకున్నారు. ఎప్పటికప్పుడు శస్త్రచికిత్సలు చేసి తిరిగి నిబంధనల ప్రకారం వారం రోజుల తర్వాత వదిలేస్తున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను స్వతంత్ర యానిమల్ వెల్ఫేర్ సోసైటీకి మున్సిపల్ అధికారులు అప్పగించారు. ఒక్కో వీధి కుక్కకు శస్త్రచికిత్స చేసినందుకు రూ.1,400 చొప్పున ఈ సంస్థకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా నగరంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని వాటిని నియంత్రించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ కార్పొరేటర్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 31న బండ్లగేరిలో మున్సిపల్ కమిషనర్ పర్యటించిన నేపథ్యంలో వీధి కుక్కలు అధికంగా కన్పించడంతో వాటిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
● జిల్లాలో కుక్కకాట్లు పెరుగుతుండటంతో జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఒక్కోరోజు ఒక్కో గ్రామంలో సగటున 10 నుంచి 30 మందిని ఒకటే కుక్క కరిచిన ఉదంతాలు ఉంటున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. శునకాలకు కు.ని. శస్త్రచికిత్సలు మొక్కుబడిగా జరుగుతుండటం వల్ల వాటి సంతతి పెరుగుతోంది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగకపోవడం వల్ల కరిచిన వారికి ప్రాణాంతకమవుతోంది.
● జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్స్‌లలో యాంటీ రేబిస్‌వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహనను కల్పిస్తున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లి నిర్ణీత డోసులను తీసుకుంటుండటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు.
జిల్లాలో రెచ్చిపోతున్న గ్రామసింహాలు
శునకాలకు అడ్డాగా పాలమూరు వీధులు
ఏటా పెరుగుతున్న కుక్క కాటు కేసులు
ఇటీవల నగరంలో వరుసగా
చిన్నారులపై దాడులు
రెండేళ్లలో 13,216 మందికి యాంటీ–రేబిస్ వ్యాక్సిన్


