ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం
స్టేషన్ మహబూబ్‌నగర్: సమ్మెతో ప్రగతి రథ చక్రాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ప్రారంభమైంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెలో దిగారు. సమ్మెలో మహబూబ్‌నగర్ రీజియన్‌లోని పది డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. వివిధ రూట్లలో వెళ్లిన నైట్‌హాల్ట్ బస్సులు ఉదయం తిరిగి ఆయా డిపోలకు చేరాయి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లలో వేచి ఉన్నారు. ఉదయం వేళల్లో ఉద్యోగులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాల్లో తరలివెళ్లారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పడిగాపులు కాశారు. సమ్మెతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా డిపోలు, బస్టాండ్‌లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి పోలీసులు బలగాలను మోహరించారు. మహబూబ్‌నగర్ డిపోలో డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షించారు.
సమస్యలు పరిష్కరించాలి
పలువురు ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థలో యూనియన్‌లపై ఆంక్షలు ఎత్తివేసి పునరుద్ధరించడంతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులకు రావాల్సిన పీఆర్‌సీలను ప్రకటించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్ప జెప్పి ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జి.లక్ష్మణ్‌గౌడ్, విజయ్‌బాబు, సాయిరెడ్డి, జిల్లా నాయకులు బసప్ప, నాగేందర్, జానకిరాములు, బి.శ్రీనివాసులు, భానుప్రకాశ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
డిపోలకే పరిమితమైన బస్సులు
ఉమ్మడి జిల్లాలో పది డిపోల్లో ఆర్టీసీ కార్మికుల నిరసనలు
సమ్మెకు సహకరించాలని ప్రైవేట్ డ్రైవర్లకు వేడుకోలు
పోలీసు బందోబస్తు మధ్య 134 బస్సులు నడిపించిన అధికారులు


