నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన విత్తనాల విక్రయదారులు, మండల వ్యవసాయ, పోలీస్‌శాఖ అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విత్తన వ్యాపారులు తమ స్టాక్‌లకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గడువు ముగిసిన విత్తనాలను దుకాణాలు, గోదాముల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప్రతి విత్తన సంచిపై ప్యాకింగ్‌ తేదీ, గడువు, సరఫరా సంస్థ పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలని తెలిపారు. ఈ వివరాలు లేని విత్తనాలను నకిలీగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండలంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాలను తనిఖీ చేసే బాధ్యత అప్పగించామని తెలిపారు. వ్యాపారులు తక్షణ లాభాల కోసం రైతులను మోసం చేయకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ గతేడాది భూత్పూర్‌లో 1,343 గడువు ముగిసిన విత్తన సంచులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జడ్చర్లలో కూడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హరిప్రియ, డీఏఓ వెంకటేష్‌, ఆర్‌టీఓ రఘు, తదితరులు పాల్గొన్నారు.

నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

మే 3న నీట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరీక్ష కేంద్రాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరీక్షల నిర్వహణ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను సురక్షితంగా తరలించడం, భద్రపరచడం వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ముందుగానే నియమించుకోవాలని సూచించారు. ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఆర్‌ఓ రామ్‌రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీస్తాం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులను వెలికితీస్తామని నూతన జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా డీవైఎస్‌ఓ క్రికెట్‌ కోచ్‌గా బదిలీపై ఆయన మహబూబ్‌నగర్‌ డీవైఎస్‌ఓగా వచ్చారు. బుధవారం యువజన, క్రీడల కార్యాలయంలో రాజశేఖర్‌రెడ్డి డీవైఎస్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ తాను ఎల్‌బీ స్టేడియంలో, జింఖానా మైదానం, రంగారెడ్డి డీఎస్‌ఓ క్రికెట్‌ కోచ్‌గా పని చేసినట్లు చెప్పారు. జిల్లాలో అన్ని క్రీడా సంఘాల సహకారంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నూతన డీవైఎస్‌ఓను పలువురు ఘనంగా సన్మానం చేశారు. అకాడమీ వాలీబాల్‌ క్రీడాకారులకు డీవైఎస్‌ఓ పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో యువజన, క్రీడల శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ రవీందర్‌రెడ్డి, పీడీ బాల్‌రాజు, కోచ్‌లు సునీల్‌కుమార్‌, పర్వేజ్‌పాష, అంజద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement