● దేవరకద్ర మార్కెట్‌లో
పేరుకుపోతున్న కుప్పలు
● ఒకపక్క తూకం వేసిన బస్తాలు
● మరోపక్క అమ్మకానికి వస్తున్న వడ్లు
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌కు నిత్యం పెద్ద ఎత్తున అమ్మకానికి వస్తున్న ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేసి తరలించడంలో జాప్యం అవుతుండదంతో ఒకపక్క తూకం వేసిన బస్తాలు, మరోపక్క అమ్మకానికి వచ్చిన ధాన్యంతో మార్కెట్ యార్డు అంతా ధాన్యంతో పేరుకుపోతున్నది. రెండు వారాలుగా మార్కెట్‌లో ధాన్యం సీజన్ ప్రారంభమైంది. కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద వేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతోపాటు బోరుబావులు, చెరువులు, కుంటల కింద వేసిన వరి పంటలు ఒకేసారి కోతలు కోస్తుండడంతో నిత్యం వేలాది బస్తాల ధాన్యం అమ్మకానికి వస్తున్నది. దీంతో రోజువారీగా 5వేల నుంచి 6వేల బస్తాల ధాన్యం మార్కెట్‌కు వస్తున్నది. మధ్యాహ్నం 1గంటకు టెండర్ల ద్వారా ధరలు ఖారారైన తర్వాత మధ్యాహ్నం 2 తర్వాత తూకాలు ప్రారంభమవుతాయి. అయితే సాయంత్రం వరకు తూకాలు కొనసాగడం ఆ తరువాత తూకం వేసిన బస్తాలను లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించే పనులు చేపడుతున్నారు. మార్కెట్ నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు తిరిగి వస్తేనే మళ్లీ ధాన్యం తరలించే అవకాశం ఉంటుంది. అయితే మిల్లుల వద్ద అన్‌లోడ్ చేయడానికి జాప్యం అవుతుండడంతో లారీలు లేక మార్కెట్‌లో తూకం వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల ఒకపక్క తూకం వేసిన ధాన్యం బస్తాలు ఉండగానే మళ్లీ అమ్మకానికి వచ్చిన ధాన్యంను బస్తాల మధ్యనే కుప్పలుగా పోసి అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కూడా వచ్చిన ధాన్యంను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసినా తరలింపులో జాప్యం కావడంతో మార్కెట్‌లో ధాన్యం పెద్ద మొత్తంలో మిగులుతున్నది.
ఉల్లివేలం రద్దు
దేవరకద్ర మార్కెట్‌లో తూకం వేసిన ధాన్యం బస్తాలు ఒకవైపు ఉండగానే అమ్మకానికి వచ్చిన ధాన్యం రాసులతో మార్కెట్‌లో ఖాళీ స్థలం లేకుండా పోయింది. దీంతో బుధవారం జరగాల్సిన ఉల్లి వేలాన్ని రద్దు చేశారు. గతవారం కూడ పరిస్థితి ఇలాగే ఉంటే చాలామంది రైతులు మార్కెట్ బయట నేరుగా వినియోగదారులకు అమ్ముకున్నారు. ఈవారం కూడ పరిస్థితి అలాగే ఉండడంతో చాలామంది రైతులు మార్కెట్‌కు ఉల్లిని అమ్మాకానికి తీసకురాలేదు.
కొనుగోలు చేయడం లేదు
మార్కెట్‌లో రెండురోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదు. చాలామంది రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసుకుని ఎదురుచూస్తున్నారు. ఇక గ్రామస్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్ల రైతులు మార్కెట్‌కు ధాన్యంను అమ్మకానికి తెస్తున్నారు. కొందరు రైతులు వెంటనే డబ్బులు వస్తాయని మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు.
తరలించడానికి ఇబ్బందులు
ధాన్యంను కొనగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లారీల్లో ధాన్యం లోడ్ చేసి మిల్లులకు తరలిస్తే అక్కడ అన్‌లోడ్ కావడానికి ఆలస్యమవుతున్నదని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల కొనుగోలు చేసిన ధాన్యంను మార్కెట్‌లోనే నిల్వ చేసుకునే పరిస్థితి వస్తున్నదని తెలిపారు.


