● గొంతునులిమి సంపులో
పడేసిన వైనం
● అనుమానాస్పద మృతి కేసు
చేధించిన పోలీసులు
కల్వకుర్తి టౌన్: తోటకు వచ్చిన వ్యక్తి స్నేహితుల ఎదుట జరిగిన వివాదంలో అవమానాన్ని భరించలేక వ్యక్తిని హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తును ప్రారంభించి హత్యగా తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌కు చెందిన శ్రీనివాస్(56) వృత్తిరీత్యా మామిడితోటలతో పాటుగా ఇతర తోటలను లీజుకు తీసుకొని పండ్ల వ్యాపారాన్ని చేసేవాడు. ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్‌లో ఓ తోటను లీజుకు తీసుకొని అక్కడే తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ నెల 13న పెద్దాపూర్ గ్రామానికి చెందిన చక్రవర్తిగౌడ్ అనే వ్యక్తి ఈ తోటను శ్రీనుకు లీజుకి ఇప్పించటంతో అతనితో ఉన్న చనువుతో అక్కడికి వారి స్నేహితుడు రాంరెడ్డి, వాళ్ల పిల్లలను తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో శ్రీనివాస్ వేరే తోటలో భార్యను దించి, తిరిగి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న మామిడి తోటకు వచ్చాడు. ఆ సమయంలో తోటలోకి వచ్చిన శ్రీనివాస్ చక్రవర్తి స్నేహితులతో గొడవకు దిగగా, అక్కడే ఉన్న రాంరెడ్డి సోదరుడు వినోద్‌రెడ్డి అక్కడకు రావటంతో శ్రీనివాస్ వారిని మా తోటలోకి ఎందుకు వచ్చారని మందలించాడు. వెంటనే అక్కడే ఉన్న చక్రవర్తి ఇరువురికి సర్దిచెప్పి గొడవను ఆపాడు.
అవమానాన్ని భరించలేక...
స్నేహితుల ఎదుట తనను అవమానించాడన్న నెపంతో చక్రవర్తితో శ్రీనివాస్‌కు మధ్య మాటమాట పెరిగి అది గొడవకు దారితీసింది. ఈ క్రమంలో చక్రవర్తి శ్రీనివాస్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. తోటలో ఉన్న సంపు వద్ద ఉండగా వెనుక నుంచి వెళ్లి గొంతునులిమి సంపులో పడేశాడు. అనుమానం రాకుండా అతని బట్టలు, సెల్‌ఫోన్‌ను అదే సంపులో వేసి, ఈత రాక సంపులో పడినట్లుగా చిత్రీకరించాలని చూసినట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో వెలుగులోకి...
శ్రీనివాస్ మృతిపై అతని భార్య వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ క్రమంలో సంపులో నీటిని బయటకు తోడుతుండగా శ్రీనివాస్ మృతదేహాం కనిపించింది. సంఘటనా స్థలంలో నిందితుడు చక్రవర్తి ఫోన్ పోలీసులకు లభ్యం కాగా వారి శైలిలో విచారణ చేయగా పొంతన లేని సమానాధాలు చెపుతుండటంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని కల్వకుర్తి సీనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లుగా డీఎస్పీ తెలిపారు. హత్య కేసును త్వరితగతిన విచారించిన వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తి, సిబ్బందిని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి అభినందించారు.


