మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పీయూలోని ఫార్మసీ కళాశాలను బుధవారం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ రికార్డులతో పాటు ల్యాబ్స్, గ్రంథాలయం, హెర్బల్ గార్డెన్ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బృందం సభ్యులు డా.గౌరవ్, డా.మహాలక్ష్మి మాట్లాడుతూ ఇక్కడి ఫార్మసీ కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులందరూ డాక్టరేట్ కలిగి ఉండటం సంతోషకరమన్నారు. అనంతరం వారిని పీయూ వీసీ శ్రీనివాస్ సన్మానించారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ పూస రమేష్‌బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.ఎన్.చంద్రకిరణ్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రవికాంత్, హెచ్‌ఓడీ వి.ప్రభాకర్‌రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎ.ఈశ్వర్‌కుమార్, చిన్నాదేవిర, సోమేశ్వర్, బి.సురేష్, శారద, సుజాత, సుస్మిత తదితరులు పాల్గొన్నారు.
24న సంసద్ ఖేల్ మహోత్సవం
ముగింపు వేడుకలు
●హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్‌ఖేల్ మహోత్సవానికి యువత నుంచి విశేష స్పందన లభించినట్లు ఇన్‌చార్జీలు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, నవీన్‌కుమార్ తెలిపారు. మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయిల్లో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియం వేదికగా ఈనెల 24వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ పరిధిలోని ప్రజలు, క్రీడాభిమానులు, యువత పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
గుప్తనిధుల కోసం తవ్వకాలు
గద్వాల క్రైం: గుప్త నిధుల కోసం గుర్తు తెలియ ని దుండగులు దేవాలయంలో గుట్టుగా తవ్వకాలు చేపట్టిన సంఘటన గద్వాల మండలంలోని పరుమాలలో వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామ శివారులోని రంగస్వామి ఆలయంలో శివలింగం, వినాయక విగ్రహాలు ఉన్నాయి. గుర్తు తెలియని దుండగులు బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించి దేవుడి విగ్రహాలను తొలగించి తవ్వకాలు చేపట్టారు. ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి, భక్తులకు గుడిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి సీఐ శ్రీను, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌లు చేరుకొని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.


