ఖిల్లాఘనపురం: కొడంగల్‌లోని లగచర్ల రైతులకు చెల్లించిన ప్రకారం గణప సముద్రం రిజర్వాయర్‌లో భూములు కోల్పయిన రైతులకు పరిహారం చెల్లించాలని గణప సముద్రం రిజర్వాయర్ భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు నల్లమద్ది రవీందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కల్యాణ మండపంలో సోమవారం గణపసముద్రం రిజర్వామర్‌లో భూములు కోల్పోయిన రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఒక్కోక్కరు వారి అభిప్రాయాలను చెప్పారు. అనంతరం సంఘం అధ్యక్షుడు, పెద్దలు రాళ్ల కృష్ణయ్య, రాఘవేందర్‌రెడ్డి, కుర్వ మాసయ్య తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన విధంగా ఎకరాలకు రూ.18 లక్షల పరిహారం, 150 గజాల ఇంటి స్థలంతో పాటుగా ఇళ్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చును ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు కొలతలు చేసిన సమయంలో 7 రోజుల్లో పరిహారం ఇస్తామని చెప్పిన నాయకులు 10 నెలలు కావస్తున్న ఇప్పటికీ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఎప్పుడు అడిగినా 10 రోజుల్లో ఇస్తామని చెబుతున్నారని ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని రైతులకు ఇచ్చిన విధంగా వెంటనే పరిహారం ఇవ్వకుంటే నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. బుధవారం రాస్తారోకో కార్యక్రమం చేపట్టి అదే రోజు రైతులందరం చర్చించి నిరసన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు తదితరులు పాల్గొన్నారు.


