ప్రభుత్వ కళాశాలల్లో క్రీ‘డల్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలల్లో క్రీ‘డల్‌’

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

63 జూనియర్‌ కళాశాలల్లో ఒక్క పీడీ కూడా లేని వైనం

అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌ క్రీడలకు ఇబ్బందులు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్ల (పీడీ) కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 63 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో దాదాపు 25వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాని 63 కళాశాలలకు ఒక్క ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) లేకపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు మిగతా జిల్లాలైన నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు పీడీలు లేకపోవడం గమనార్హం.

అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌కు నిర్వహణ భారం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు లేకపోవడంతో ముఖ్యంగా ప్రతి ఏడాది నిర్వహించే అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడల నిర్వహణపై ప్రభావం ఏర్పడుతుంది. కళాశాలల్లో పీడీ లేకపోవడంలో గత విద్యాసంవత్సరం నుంచి జిల్లా పాఠశాల ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఆధ్వర్యంలో అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ క్రీడలు ఎంపికలు నిర్వహించారు.

కళాశాలల్లో పీడీలను నియమించాలి...

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పీడీలు లేరు. పాఠశాలస్థాయిలో అండర్‌–14, అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. అయితే పీడీలు లేకపోవడంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అండర్‌–19 ఎస్‌జీఎఫ్‌లో విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటలేకపోతున్నారు. హైస్కూళ్లలోని సీనియర్‌ పీడీలకు పదోన్నతులు కల్పించి జూనియర్‌ కళాశాలల్లో పీడీలుగా నియమించాలని విజ్ఞప్తి. పీడీలు వస్తే కళాశాలల్లో క్రీడలు నిరంతరంగా జరుగుతాయి, తద్వారా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభచాటి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. – దూమర్ల నిరంజన్‌, తెలంగాణ రాష్ట్ర పీడీ, పీఈటీల అసోసియేషన్‌ అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement