సిమెంట్‌ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

రాజాపూర్‌: ఓ కారు రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టిన మండలకేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుల్కచర్ల మండలానికి చెందిన అరుణ్‌కుమార్‌ నేవీ ఉద్యోగి కాగా మహబూబ్‌నగర్‌లో నివసిస్తున్నాడు. సోమవారం హైదరాబాద్‌ నుంచి కారులో మహబూబ్‌నగర్‌కు వస్తుండగా రాజాపూర్‌ మండల కేంద్రంలో ముందు వెళ్తున్న కారును తప్పించపోయి సడన్‌గా పక్కకు తిప్పడంతో కారు సిమెంట్‌ దిమ్మెను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న అరుణ్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి కారును పక్కకు జరిపారు. ఒక వేళ వెనక నుంచి మరో వాహనం వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు తెలిపారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా రోడ్డుపై ఉన్న కారును పక్కకు తీశారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్‌ క్రైం: వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మున్సిపాలిటీలోని ఎండబెట్లలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్‌ కథనం ప్రకారం.. ఎండబెట్లకు చెందిన బొడ్డుపల్లి వీరేష్‌ (26) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

భార్య వెళ్లిపోయిందనిమనస్తాపం..

గోపాల్‌పేట: భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆవేదనకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా.. మండల కేంద్రంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన గగనం శ్రీనివాసులు(33) తన భార్య తనను విడిచిపెట్టి వారి అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిందని బాధతో శ్రీనివాసులు కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఇదేక్రమంలో ఆదివారం 3గంటల ప్రాంతంలో కోదండ రామస్వామి ఆలయం ముందున్న కోనేరుకు వెళ్లి నీటిలో మునిగాడు. ఆదివారం ఫైర్‌ సిబ్బంది కోనేరులో వెతికి బాడీని బయటకు తీశారు. బాధితుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గోపాల్‌పేట ఎస్‌ఐ జగన్‌మోహన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement