కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన బి.వెంకటేష్ చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు పల్లెర్ల గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టి సుమారు 12 క్వింటాళ్లు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పంచనామ పూర్తి చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి మండలాల పరిధిలో ఎవరైనా అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినా, రవాణా చేసినా లేదా ఇతరులకు అమ్మినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
మన్యంకొండ నరసింహస్వామికి విశేష పూజలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని కోనేరు వద్ద గల వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయం వేళల్లోనే విశేష అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పాలతో అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.


