మహబూబ్‌నగర్ క్రైం: మెడిసిన్ విద్యార్థులు ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి తప్పా.. ర్యాగింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టరాదని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలలో యాంటీ–ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చట్టరీత్యా నేరం కావడంతోపాటు సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాంటి విద్యార్థుల ఉత్తమ విద్య, భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందని తెలిపారు. అనైతిక చర్యలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీస్తాయని వెల్లడించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి కళాశాలలో ఆరోగ్యకరమైన విద్య వాతావరణం నెలకొల్పడానికి ప్రతివిద్యార్థి బాధ్యతగా ఉండాలన్నారు. కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ భూపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జోషి తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ వెంకటేశ్వర్లు


