ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: వేసవికాలం కావడంతో నగరంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం క్లాక్‌టవర్‌ వద్ద ‘జలధార’ పేరిట వ్యాపారులకు ఉచితంగా కూల్‌వాటర్‌ క్యాన్స్‌ పంపిణీ చేశారు. అలాగే మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం మెయిన్‌ గేట్‌ వద్ద చలివేంద్రం ప్రారంభించారు. అంతకుముందు అప్పన్నపల్లి, ఎదిరలో నిర్మించిన కొన్ని ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయా కార్యక్రమాలలో నగర మేయర్‌ జి.మమత, డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్‌ ఇంటర్‌ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,329 మంది విద్యార్థులకు 1,250 మంది హాజరయ్యారు. ఇక ఎస్సెస్సీలో 19 పరీక్ష కేంద్రాలు ఉంటే 836 మందికి 725 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌, 15 మంది సిట్టింగ్‌స్క్వాడ్స్‌ను నియమించారు.

ఎస్సీ గురుకులాల్లో దరఖాస్తుల స్వీకరణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మినీ గురుకులాల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాక్‌ సీట్ల భర్తీకి ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని, వచ్చే నెల 5వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని పేర్కొన్నారు. 11వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, 12వ తేదీన అడ్మిషన్ల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

‘22 వరకు దరఖాస్తు చేసుకోవాలి’

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో ఉన్న మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ వంటి కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ మోహన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 22వ తేదీ వరకు అవకాశం ఉందని, వచ్చేనెల 13న పాలిసెట్‌ ఎంట్రెన్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రమాదాలు నివారణపై అవగాహన అవసరం

మహబూబ్‌నగర్‌ క్రైం: అగ్నిప్రమాదాలు ఏర్పడినప్పుడు అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి అనే అంశంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కిషోర్‌ అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల(మహిళలు)లో అగ్ని ప్రమాదాలపై సదస్సు నిర్వహించారు. వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయని అలాంటి సమయంలో భయాందోళనకు గురికాకుండా చాకచక్యంగా స్పందించాలన్నారు. అగ్నిప్రమాదాలు జరిగితే 101తో పాటు 87126 99351, 87126 99350లకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం ఫైర్‌ ఆఫీసర్‌ మల్లిఖార్జున్‌ అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్‌ సెప్టీ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement