● కలెక్టర్ ఖుష్బూగుప్తా
● గైర్హాజరైన అధికారులకు
షోకాజ్ నోటీసులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో అర్జిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సీఎం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉంచకూడదని వాటి పరిష్కారానికి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఖుష్బూగుప్తా అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియతో కలిసి ప్రజల నుంచి అర్జిలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీ, భూసర్వే–ల్యాండ్ రికార్డ్స్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల వద్ద ఉన్న ిపెండింగ్ ఫైళ్ల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారని తెలిపారు. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా వాటికి పరిష్కరించేందుగు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనాభా గణనకు సంబంధించిన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.
అధికారులపై ఆగ్రహం...
ప్రజావాణికి హాజరుకాని అధికారులపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసు ఆదేశా లు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వ హిస్తుందని, దీనిని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరైతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో మున్సిపల్, జిల్లా సంక్షేమం, భూ–సర్వే రికార్డులు, గృహనిర్మాణం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, గనులు, కాలుష్య నియంత్రణ తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 126 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రామ్‌రెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్‌డీఓ నర్సింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


