సమ్మెకు సై.. | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు సై..

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పలు డిమాండ్ల సాధన దిశగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ అందజేసిన ఆర్టీసీ జేఏసీ డిపోల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట గేటు సమ్మె చేపట్టి కార్మికులను జాగృతం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. తొలి సర్వీస్‌ నుంచే విధులు బహిష్కరించనున్నట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు, ప్రయాణికులు మద్దతు పలకాలని కోరారు. 2019లో డిమాండ్ల సాధనకు అక్టోబర్‌ ఐదు నుంచి 52 రోజులపాటు నిరవధిక సమ్మె చేపట్టిన కార్మికులు.. తాజాగా మళ్లీ సమ్మె బాట పట్టారు.

925 బస్సులు.. 3267 మంది కార్మికులు

మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌లోని పది డిపోల పరిధిలో 925 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 543, అద్దె బస్సులు 359, ఈవీ బస్సులు 23 ఉన్నాయి. మొత్తంగా 1,523 మంది కండక్టర్లు, 923 మంది రెగ్యులర్‌ డ్రైవర్లు, 148 మంది ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లు, 385 మంది మెకానిక్‌ సిబ్బంది, 288 మంది వరకు ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. రీజియన్‌ పరిధిలో ప్రతి రోజు సుమారు 4.30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతి రోజు ఆర్టీసీకి దాదాపు రూ.2.05 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. కార్మికుల సమ్మె ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అద్దె బస్సులు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మె ఉన్నా 50 శాతం బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేటి నుంచి ఆర్టీసీ బంద్‌

డిమాండ్ల సాధనకు కార్మికుల ఆందోళన బాట

రీజియన్‌లోని 10 డిపోల పరిధిలోనిలిచిపోనున్న బస్సు సర్వీసులు

అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..అద్దె బస్సులు నడిపేలా చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement