ఓటరు జాబితా తయారీకి ఈసీ ఆదేశం
సిద్ధంగా ఉన్నాం..
● ఈ నెల 23 వరకు మ్యాంపింగ్ ప్రక్రియ
● జిల్లాలో 16 జెడ్పీటీసీ,
175 ఎంపీటీసీ స్థానాలు
● జిల్లావ్యాప్తంగా
4,99,582 మంది ఓటర్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. మిగిలిన పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఉత్తర్వులు జారీచేసింది. సీఈసీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా అనుసరించి అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు కసరత్తు సైతం ప్రారంభించారు. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 175 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో ఇటీవల మహమ్మదాబాద్, కౌకుంట మండలాలు కొత్తగా ఏర్పడగా.. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనుండటంతో 16కు సంఖ్య చేరింది.
అసెంబ్లీ జాబితా ఆధారంగా..
కేంద్ర ఎన్నికల సంఘం గతేడాది జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. దీంతో కొత్త ఓటర్లు స్పల్పంగా పెరిగారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 4,99,582 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,48,222, మహిళలు 2,51,349 మంది ఉండగా.. ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ నెల 23 వరకు ఓటరు జాబితాను మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
చిగురించిన ఆశలు..
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుందని రాజకీయ పార్టీలతోపాటు ఆశావాహులంతా భావించారు. అయితే బీసీ రిజర్వేషన్ల్ అంశం కోర్టులో తేలాకే వాటిపై ముందుకుపోవాలని ప్రభుత్వం భావించడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎస్‌ఈసీ ఓటర్ల జాబితాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చనట్లు అయింది. అయితే వెంటనే చేపడుతుందా.. లేదా రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తుందా అనే దానిపై మాత్రం అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అధికారులు మాత్రం ఎస్‌ఈసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేయనున్నాం. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితా ఆధారంగా మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశాం.
– వెంకట్‌రెడ్డి, జెడ్పీసీఈఓ


