ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి | - | Sakshi
Sakshi News home page

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

పాలమూరులో తీవ్రమైన ఎండలు

పాలమూరు: ఉదయం 7 గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జిల్లాలో ఒకవైపు ఉదయం తీవ్రమైన ఎండలు.. రాత్రి వేళ వేడి, ఉక్కపోతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పల్లెల్లో సైతం తీవ్రమైన వేడి వల్ల నీరు, చెట్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇక ఇంట్లో కూడా ఉక్కపోత భరించలేని విధంగా అనిపిస్తోంది. ఫ్యాన్ల నుంచి కొద్దిసేపటికే వేడి గాలి వస్తుండటంతో జనాలు ఎలా సేద తీరాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికంగా ఎండ ఉన్నా.. సాయంత్రం వాతావరణం కొంత చల్లబడినట్లు అనిపించింది. కానీ వేడి, ఉక్కపోత వల్ల చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార సముదాయాలు, రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి.

మహిళా బిల్లు పేరుతో బీజేపీ రాజకీయం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహిళా బిల్లు పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహిళా సాధికారిత కోసం కాంగ్రెస్‌ పార్టీ కృషిచేసిందని, మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చి మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్లు గుర్తుచేశారు. అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. డీలిమిటేషన్‌ బిల్లును మహిళా బిల్లుతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఇప్పుడున్న 543 పార్లమెంట్‌ స్థానాలకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెడితే కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌ అఖ్తర్‌ మాట్లాడుతూ మహిళా బిల్లు పేరుతో తమిళనాడు, బెంగాల్‌లో ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలను మోసం చేసేవిధంగా బీజేపీ ప్రభుత్వం బిల్లుపై రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికుల

సమస్యలు పరిష్కరించాలి

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తుందని, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని, వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చలకు రావడం లేదని ప్రశ్నించారు. యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విధానపరమైన సమస్యలు అనడం సమంజసం కాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ముందుకురావాలని, ఆర్టీసీ కార్మి సంఘాలతో చర్చించి.. ఈ నెల 22 నుంచి జరిగే ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement