దేవరకద్ర: పేరూరు గ్రామ స్ఫూర్తి రాష్ట్రానికి మార్గదర్శకం అని, విద్య అవసరాన్ని 75 ఏళ్ల క్రితమే గుర్తించి ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి జెడ్పీ చైర్‌పర్సన్ కేకే రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం కౌకుంట్ల మండలంలోని పేరూర్ గ్రామంలో నిర్వహించిన జెడ్పీ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లో కరెంట్, రోడ్లు, ఆస్పత్రులు లేని కాలంలో పేరూరు గ్రామం విద్య కోసం పోరాడిందని, ఆ పోరాటమే ఈ రోజు పేరూరును ప్రత్యేకంగా నిలబెట్టిందన్నారు. పేరూరులో మీనీ స్టేడీయం ఏర్పాటు చేస్తామని యువతకు క్రీడా వసతులు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్య, సంక్షేమం, అభివృద్ధి మూడు రంగాల్లో తెలంగాణను ముందంజలో నెలబెట్టే దిశగా ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తామని, పాఠశాలలో మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేరూర్ పాఠశాలకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో కృషిచేశానన్నారు. అంతకు ముందు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. కార్యక్రమరంలో సర్పంచ్ శృతి, అరవింద్‌రెడ్డి, డీజీక్వెస్ట్ చైర్మన్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


