ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఇతర వ్యర్థాలను శుద్ధి చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా బయటకు విచ్చలవిడిగా పారబోస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు చెరువులు, నేలలోకి చేరితే వాటి ప్రభావం ఏళ్లతరబడి ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నేరుగా నేలలోకి దిగితే అది క్రమంగా ఇసుక, రాళ్ల పొరల మధ్యకు చేరి బోర్ల నీరు కాలుష్యంగా మారి వ్యవసాయ నీటి వనరులు కలుషితమవుతాయి. అలాగే నీటికి ఉప్పుదనం పెరిగి తాగడానికి పనికిరాకుండా పోతాయి. పంటలకు ఇలాంటి కలుషిత నీటిని అందిస్తే మట్టిసారం దెబ్బతినడం, పంటల ఎదుగుదల కోల్పోతాయి. అలాగే మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు చర్మ సంబంధ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక చెరువులు, కాల్వలు, వాగులు, బావులలోకి చేరిన వ్యర్థజలాలు నీటిని కలుషితం చేయడమే గాక మొత్తం జీవ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఫలితంగా నీటిలో బతికే చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతాయి. వాసనతోపాటు చెరువులలో నీటి రంగు మారి ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో మూగజీవాలకు సైతం తాగడానికి పనికిరాకుండా పోతుంది. ఫార్మ పరిశ్రమల నుంచి వెలువడే పొగ, దుర్వాసన ప్రభావంతో గాలి కాలుష్యం పెను భూతంగా మారుతుంది. రాత్రివేళల్లో ఎక్కువగా వీటి ప్రభావం ఉంటుందని దుర్వాసన, కళ్లు, గొంతు మంటతోపాటు తలనొప్పి తదితర శ్వాస ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.


