తుది సమావేశానికి సమాయత్తం | - | Sakshi
Sakshi News home page

తుది సమావేశానికి సమాయత్తం

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గానికి మేనెల 6వతేదీతో గడువు ముగియనుండటంతో చివరి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే సమావేశానికి ఆటంకాలు ఎదురవుతుండగా వాటిని అధిగమించి సాఫీగా నిర్వహించే ఆస్కారం ఉందా అన్న సందేహాలు నెలన్నాయి. 2021 మే 7న ప్రమాణస్వీకారం చేసిన పాలకవర్గం ఐదేళ్లు ముగియనున్నప్పటికీ కోఆప్షన్‌ సభ్యులు లేకుండానే పాలన కొనసాగించటం గమనార్హం. అనేక ఆశయాలు, లక్ష్యాలతో పగ్గాలు చేపట్టిన పాలకవర్గం మూడు అవినీతి ఆరోపణలు.. ఆరు వివాదాలు అన్నట్లుగా పాలన సాగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా..

● 1960లో మున్సిపాలిటీగా ఉన్న బాదేపల్లి ఆ తర్వాత మారిన సమీకరణలో గ్రామ పంచాయతీ, మేజర్‌ గ్రామపంచాయతీ తిరిగి మున్సిపాలిటీగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాదేపల్లి, జడ్చర్ల, నాగసాల, బూరెడ్డిపల్లి, కావేరమ్మపేటతో జడ్చర్ల మున్సిపాలిటీగా ఆవిర్భవించి 2021ఏప్రిల్‌లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 27 కౌన్సిల్‌ స్థానాలకుగానూ బీఆర్‌ఎస్‌ 23, 2 బీజేపీ, 2 కాంగ్రెస్‌లు గెలిచాయి. చైర్‌పర్సన్‌ బీసీ మహిళకు రిజర్వు కావడంతో అప్పటి ఎమ్మెల్యే డా. లక్ష్మారెడ్డి దోరేపల్లి లక్ష్మి చైర్‌పర్సన్‌గా, వైస్‌ చైర్‌పర్సన్‌గా అదే పార్టీకి చెందిన పాలాది సారికను నియమించారు. ఇద్దరి మహిళలతో పాలన ఎలా అన్న సందేహాలకు తావులేకుండా రెండేళ్లపాటు సవ్యంగానే కొనసాగించారు. అంతా తానే అయి లక్ష్మారెడ్డి పాలన చేయించారు. కాలక్రమేణా వార్డుకౌన్సిలర్లలో వివాదాలు తలెత్తటం, అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి ఓడిపోవటం, కాంగ్రెస్‌ అనిరుధ్‌రెడ్డి గెలవటం జరిగాయి. ఈ క్రమంలో చైర్‌పర్సన్‌–కొందరు కౌన్సిలర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మున్సిపాలిటీలో పందుల తరలింపు సైతం దుమారం లేపింది. చివరకు లక్ష్మారెడ్డి సమ్మతితో 2024 ఆరంభంలో దోరేపల్లి లక్ష్మిపై అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపారు. ఆ తరువాత 7నెలలపాటు చైర్‌పర్సన్‌ నియామకం లేకుండానే పాలన సాగింది. చివరకు 2024 నవంబర్‌ నెలలో చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన కోనేటి పుష్పలతను ఎన్నుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకే ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆశీస్సులతో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్లపాటు పాలన సవ్యంగానే సాగినప్పటికి కొంతకాలంగా వివాదాస్పద, స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కుంటున్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు అనుకూలమంటూ సొంత పార్టీలో ఆరోపణలు ఎదుర్కోవా ల్సి వస్తుంది. దీనికితోడు నిధుల కేటాయింపులో జ రిగిన పరిణామాలు అందుకు ఊతమిచ్చినట్లయ్యింది. ఇంకేముంది. ఇదే అదనుగా చివరి కౌన్సిల్‌ సమావేశ నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తున్నారు.

మున్సిపల్‌ కార్యాలయం

కోఆప్షన్‌ సభ్యులు లేకుండానే..

పాలకవర్గం ఏర్పడిన తొలినాళ్లలోనే కో ఆప్షన్‌ సభ్యులను నియమించటం పరిపాటి. అయితే అనేక రాజకీయ కారణాలతో లక్ష్మారెడ్డి కోఆప్షన్‌ సభ్యుల నియామకానికి ఆసక్తి చూపలేదు. ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులు కో ఆప్షన్‌ పదవిపై ఆశపెట్టుకుని ఇప్పుడు, అప్పుడు అంటూ కాలం గడవటంతో నిట్టూరుస్తున్నారు.

వచ్చేవారంలో..

మున్సిపల్‌ చివరి కౌన్సిల్‌ సమావేశం వచ్చేవారం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాము. ఇందుకోసం అంతా సన్నద్దం చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సహకారంతో నిర్వహించే సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోనున్నాం. మే 6తో మా గడువు ముగియనున్నందున ఇదే చివరి సమావేశం అవుతుంది. మధ్యలో కొన్ని చిన్నచిన్న ఆటంకాలతో ఆలస్యం జరుగుతుంది. – కోనేటి పుష్పలత,

చైర్‌పర్సన్‌, జడ్చర్ల మున్సిపాలిటీ

మే 6తో ముగియనున్న జడ్చర్ల పురపాలకవర్గం గడువు

ఇన్నాళ్లు కోఆప్షన్‌ సభ్యుల నియామకం లేకుండానే పాలన

ఆటంకాలు కలుగుతున్నాయన్న వాదనలు

Advertisement
 
Advertisement
Advertisement