● వ్యాపారులతో బంగారం బిల్లలు విక్రయించేందుకు యత్నం
● మీడియా అన్వేషించగా.. అజ్ఞాతంలోకి వెళ్లిన వైనం
గద్వాల క్రైం: గద్వాల జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని అనుమానిత వ్యక్తులు వ్యాపారులను ఏమరచి చోరీలకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరల్లోకి వేళ్తే.. జిల్లా కేంద్రంలోని గుర్తుతెలియని వ్యక్తులు తమ వద్ద బంగారం బిల్లలు ఉన్నాయంటూ వ్యాపారుల వద్దకెళ్లి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా బంగారు బిల్లలు విక్రయిస్తున్నట్లు తెలుపుతున్నారు. మేలిమి బంగారం వీటిని పరిశీలించిన తర్వాతే డబ్బులు ఇవ్వాల్సిందిగా వ్యాపారులకు సూచిస్తున్నారు. కొందరు వ్యాపారులు మాత్రం వాటికి సంబంధించిన బిల్లులు, రసీదులు ఉంటే కొనుగోలు చేస్తామని సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. అయితే గతంలో కొందరు వ్యాపారులు అపరిచితుల మాటలు నమ్మి బంగారు బిల్లలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వ్యాపారులు పూర్తిస్థాయిలో పరిశీలించిన క్రమంలో నకిలీ బంగారు బిల్లలుగా తేలింది. ఈ విషయం బయటకు తెలిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించి మోసపోయిన వ్యాపారులు ఉన్నారు. జరిగిన ఘటనలధాటికి అపరిచితుల నుంచి కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేశారు. విషయం తెలుసుకున్న మీడియా బృదం అపరిచితుల కోసం అన్వేషణ చేపట్టారు. అప్పటికే అపరిచితులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇలాంటి ముఠా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉంటారని వ్యాపారులు చెబుతున్నారు.


