చేపల వేటకు వెళ్లి శవమై తేలాడు | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి శవమై తేలాడు

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

రాజాపూర్‌: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో శవమై తేలిన సంఘటన శనివారం మండల పరిధిలోని కుచ్చర్‌కల్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మంగళి కృష్ణయ్య(55) తన పొలం పక్కన ఉన్న మామిడికుంటలో రాత్రి సమయంలో చేపల వల వేసి ఉదయం చేపలు తీసుకొని వచ్చేవాడు.. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రోజు మాదిరిగా పొలం వద్దకు వెళ్లాడు. శనివారం ఎంతకు రాకపోవడంతో మృతుడి కుమారుడు శ్రీనివాసులు పొలం వద్దకు వెళ్లగా.. చెరువు కట్టపై తండ్రి బట్టలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చెరువులో వల కాళ్లకు చుట్టుకొని కృష్ణయ్య శవమై తేలాడు. అనంతరం గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

అప్పులబాధతో

యువకుడు బలవన్మరణం

చారకొండ: అప్పులబాధతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలం చంద్రాయన్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వీరబాబు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కందుకూరు మధు (34) కొంతకాలంగా కల్వకుర్తిలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం అప్పుచేసి ఎకరా పొలం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక తీవ్ర మనస్తాపంతో శుక్రవారం స్వగ్రామానికి వచ్చాడు. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తన భార్యకు వాట్సప్‌లో తాను ఉరేసుకుంటున్నట్లు స్వీయ చిత్రాన్ని తీసి పంపించాడు. ఆమె సమీప కుటుంబీకులను ఇంటికి పంపించే సరికి విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య మాధవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాధవి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మట్టి దిబ్బ కూలి.. మహిళ మృతి

కొత్తకోట రూరల్‌: చెరువులో ఉపాధి పనులు చేస్తున్న క్రమంలో మట్టి దిబ్బ కూలి మహిళ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా పాలెంలో చోటు చేసుకుంది. స్థానికులుతెలిపిన వివరాలు.. పాలెం గ్రామ శివారులోని కర్ణమోని కుంట చెరువులో శనివారం ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి దిబ్బ కూలడంతో కూలీలు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చివర్లో ఉన్న శాంతమ్మ, కొండన్నపై మట్టి దిబ్బ పడింది. దీంతో శాంతమ్మ(59)కు తీవ్ర గాయాలు కాగా కొండన్నకు స్వల్ప గాయాలయ్యాయి. శాంతమ్మను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పని ప్రదేశంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటలను జరుగుతున్నాయని కూలీలు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement