మక్తల్: రైతులకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సాయంత్రం మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి వద్ద కొనసాగుతున్న మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. డీపీఆర్‌లో ఉన్న వివరాలను ఎస్‌ఈ శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్ పనులు ఎలా జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ నిర్వాసితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని తెలిపారు. ఇప్పటికే ఎకరాకు రూ.20లక్షలు నష్టపరిహారం అందించిందని పేర్కొన్నారు. ఇంకా నష్టపరిహారం అందని రైతులకు సత్వరమే అందిస్తామని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్‌గౌడ్, ఈడబ్ల్యూఈ నాగశివ, చెన్నయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి


