మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ | - | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

మానవపాడు: నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలోని శ్రీనగర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ స్వాతి, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌ పంచాయతీలోని శ్రీనగర్‌ గ్రామంలో రాధ, చలపతిరావు దంపతులు నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాధ మెడలో ఉన్న బంగారు గొలుసు 5 తులాల బంగారాన్ని చోరీ చేసి వెళ్లారు. వారికి మత్తు మందు ఇచ్చి చోరీ చేశారని బాధితులు వాపోతున్నారు. 5 తులాల బంగారు గొలుసు బంగారు, 4.42 గ్రాములు, 1 పుస్తె గొలుసు బంగారు మొత్తం 5 తులాల బంగారును చోరీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ స్వాతి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ధన్వాడ: మండలంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన పి.వెంకటయ్య(55) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల మేరకు.. వెంకటయ్య శనివారం ఉదయం తన కూతురుని చూసేందుకు నారాయణపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ధన్వాడలో బస్సు దిగి అక్కడి నుంచి స్వగ్రామానికి తెలిసిన వారి బైకుపై వెళ్తుండగా మనిపూర్‌ తండా దాటిన తర్వాత మలుపు వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలైన వెంకటయ్యను ధన్వాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక ఆస్పత్రి నుంచి ఇంకో ఆస్పత్రికి తిప్పుతూ సరైన వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement