పాలమూరు: రోడ్డు ప్రమాదాల రూపంలో ఏటా రాష్ట్రంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు క్షతగాత్రులుగా మారి ఆర్థికంగా చితికిపోతున్నారని, తెలంగాణను రోడ్డు ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నట్లు వెల్లడించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పంచవటి పాఠశాలలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఎంవీఎస్ కళాశాల నుంచి బైక్‌లపై ర్యాలీగా పంచవటి పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు మెడికల్ స్టాల్ ప్రారంభించారు. పాఠశాలలో ఎంవీఐ వాసుదేవ్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన చిల్డ్రన్ ట్రాఫిక్ అవగాహన పార్క్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగాపలువురు విద్యార్థులు ట్రాఫిక్ పార్క్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉంటాయి? సిగ్నల్స్ అమలు విధానం, జీబ్రా క్రాసింగ్ పనితీరు, స్కూల్, ఆస్పత్రి జోన్, యూటర్స్, ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎలా పని చేయాలనే అంశంపై ప్రదర్శన చేసి చూపించారు. ఆనంతరం ఆరోగ్య శిబిరం, కంటి పరీక్షల కేంద్రం, సీపీఆర్‌పై అవగహన కల్పించే కేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనలను దినపత్రికల ద్వారా చూపించారు. సంగారెడ్డిలో దావత్ చేసుకుని తిరిగి హైదరాబాద్‌కు వస్తుంటే ప్రమాదం జరిగిందని ఇలా మద్యం మత్తులో ప్రమాదాలు కావడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను మొదటి గంట గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చి వారి ప్రాణాలను కాపాడితే అలాంటి వారిని గుర్తించి రహవీర్ పథకం కింద ప్రభుత్వం రూ.25వేల పారితోషికం ఇస్తుందన్నారు. ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌ను సందర్శించి అక్కడ సైన్‌బోర్డులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలపై, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పెంచాలన్నారు. పోలీస్ శాఖ తరచూ వాహనాలు తనిఖీలు చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించి నిబంధనలు పాటించని వారికి అవగాహన పెంచాలన్నారు. ప్రతి ఏడాది ఐదుసార్లు రహవీర్ అవార్డు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి
రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నాం
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన
వారికి రహవీర్ పథకం ద్వారా రూ.25వేల పారితోషికం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


