మహబూబ్‌నగర్ క్రైం: వేసవి సెలవుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దొంగతనాల నివారణకు ప్రజల నుంచి సహకారం అవసరం అని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. సెలవులు, శుభకార్యాల వల్ల కుటుంబసభ్యులతో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఇంటి బయట లేదా ఇళ్లపై నిద్రించే వారు మెడలో ఉండే బంగారం ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంట్లో అధిక మొత్తంలో బంగారం, నగదు ఉండకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఇంటికి నాణ్యమైన తాళాలు వేయడం, బస్సుల్లో ప్రయాణం చేసే సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉంటూ అపరచితులు ఇచ్చే ఎలాంటి ఆహారం తీసుకోరాదని సూచించారు.
● జిల్లా విశ్రాంతి పోలీసుల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఎస్పీ డి.జానకి ప్రారంభించారు.కోయిలకొండ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ తిరుపాజీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి బహుమతులు అందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వెళ్తున్న 26 మంది హోంగార్డులకు మెడికల్ కిట్లు, వాటర్ బాటిల్స్‌ను ఎస్పీ అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సమ్మెతోనే కార్మికుల
సమస్యలు పరిష్కారం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు సమ్మెతోనే పరిష్కారం జరుగుతుందని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు జి.లక్ష్మణ్‌గౌడ్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన సమ్మె సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇచ్చి కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థలో యూనియన్‌లపై ఆంక్షలు ఎత్తివేసి పునరుద్దరించాలని, కార్మికులకు రావాల్సిన పీఆర్‌సీలను ప్రకటించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి ఉద్యోగుల నియామకాలు చేపట్టాలనే మొత్తం 32 సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ నాయకులు బసప్ప, కృష్ణయ్య, బీఎన్‌రెడ్డి, రాజలింగం, మల్లికార్జున్, బుచ్చన్న, సంజీవరెడ్డి, చిన్నమ్మ, మంజుల, నిర్మల, హేమంత్‌కుమార్, రవికుమార్, సుకుమార్‌రెడ్డి, జేజేరావు పాల్గొన్నారు.
ఆర్‌ఎన్‌ఆర్ @ రూ. 2,117
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర గరిష్టంగా రూ.2,117, కనిష్టంగా రూ.1,961గా ధరలు లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,729, కనిష్టంగా రూ.1,609, ఆముదాల ధర గరిష్టంగా రూ.6,089, కనిష్టంగా రూ.6,062గా ధరలు నమోదయ్యాయి.


