● డబ్లింగ్‌లైన్‌ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే స్టేఫీ కమిషనర్ మాధవి
స్టేషన్ మహబూబ్‌నగర్: రైలు అనుసంధానాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక అడుగుపడింది. మహబూబ్‌నగర్–మన్యంకొండ మధ్య కొత్తగా నిర్మించిన డబుల్‌లైన్‌ను (రెండో లైన్) శనివారం రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి సమగ్రంగా తనిఖీ చేసి స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. మహబూబ్‌నగర్ స్టేషన్ నుంచి మన్యంకొండ వరకు ఇతర అధికారులతో కలిసి ఆమె ప్రత్యేక మోటార్ ట్రాలీపై ప్రయాణించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవితో పాటు సీఏఓ నిర్మాణం విభాగం అధికారి రణధీర్‌రెడ్డి, హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్‌కుమార్‌వర్మ, చీఫ్ ఇంజనీర్ (నిర్మాణ విభాగం) నాగభూషణం, ఇతర ఉన్నతాధికారులు ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనల నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే ముందు అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్ధారించారు. కొత్త ట్రాక్‌పై రైళ్ల స్థిరత్వం, సాఫీగా కదలడాన్ని పరీక్షించడానికి హైస్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంతో సీఆర్‌ఎస్ ఈ లైన్‌ను కార్యాచరణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ సెక్షన్‌లో రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతి లభించింది. ఈ రద్దీ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడానికి, సమయ పాలనను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈ డబుల్‌లైన్ అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్–డోన్ మార్గంలో రద్దీ గణనీయంగా తగ్గి రైళ్ల రాకపోలకు మరింత సమర్థవంతంగా సాగుతాయని, అలాగే ప్రయాణికులకు ప్రయాణ సమయం కూడా తగ్గు తుందన్నారు. ప్రాంతీయ రవాణా అవసరాలను తీ ర్చేందుకు, మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు, దక్షిణమధ్య రైల్వే కట్టుబడి ఉందని తెలిపారు.


