మహబూబ్‌నగర్ రూరల్: పోషకాహార లోపాలను అరికట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి సూచించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం ధర్మాపూర్ అంగన్‌వాడీకేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమానికి కమిషన్ మెంబర్లు వందనాగౌడ్, అపర్ణలతో కలిసి ఆమె హాజరై వివిధ పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు, కిషోర బాలలకు పోషణ లోపం లేకుండా చూడాలని అన్నారు. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచి రెండేళ్ల వరకు (వెయ్యి రోజులు) మంచి పౌష్టికాహారం అందించేలా అంగన్‌వాడీ టీచర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. చిన్నారులకు అనుకూల సమయంలో టీకాలు వేయించడం, పోషకాహారాన్ని అందించడం, మానసికశక్తి అభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, సీడీపీఓ శైలాశ్రీ, డీసీపీఓ నర్మద, సూపర్‌వైజర్ జగదీశ్వరి, సర్పంచ్ రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


