కోడేరు: హైదరాబాద్‌లో మహిళ ఉరేసుకొని మృతి చెందిన ఘటన మండలంలోని నాగులపల్లితండాలో విషాదం నింపింది. గ్రామస్థుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలంలోని కిష్టాపూర్‌తండాకు చెందిన రాత్లావత్ సంగీత (23), కోడేరు మండలం నాగులపల్లి తండాకు చెందిన రాత్లావత్ రమేష్ 2024లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో బతుకుదెరువు కోసం రమేష్ హైదరాబాద్‌లోని అల్వాల్‌లో ఆటో నడుపుతూ అక్కడే దంపతులు జీవనం గడిపేవారు. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సంగీత అల్వాల నివాసముంటున్న ఇంట్లో ఊరేసుకొని మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇటిక్యాల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవిరాథోడ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్దదిన్నే గ్రామానికి చెందిన కురువ లక్ష్మన్న (48) కొంత కాలంగా ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన పెద్ద కుమారై గీత అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపనికి గురై గురువారం పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పుష్పమ్మ ఫిర్యాధు మేరకు కేసు నమాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత: కేసు నమోదు
తెలకపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున బ్లూకోర్టు సిబ్బంది మండలంలోని గౌరెడ్డిపల్లి గ్రామ శివారులో విధుల నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
మర్రిగూడ(చింతపల్లి): అతివేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన సూర్య గిరిధర్‌గౌడ్(28) వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు తన స్నేహితుడు అవినాష్‌తో కలిసి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గిరిధర్‌గౌడ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి స్నేహితుడు అవినాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అవినాష్‌ను మాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడు సూర్య అరవింద్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నేడు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారి జానీ పాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో 250 వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న జాబ్‌మేళాను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 8919380410 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఎస్సీ వర్గీకరణ
అమలు చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక, రాజకీయకుల గణనలో మాదిగ మెజార్టీ జనాభాగా ఉన్నాదని ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయమని, మెజార్టీగా ఉన్నవారికి ఏబీసీడీ వర్గీకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో 11శాతం రిజర్వేషన్లు అమలు కావాలని ప్రభుత్వానికి విన్నవించిన పట్టించుకోకుండా వర్గీకరణను అమలు చేయకుండా అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. పేరుకే అత్యధిక జనాభా కలిగిన మాదిగలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఇతర పదవుల్లో కనీసం ప్రాతినిద్యం లేదన్నారు. ప్రభుత్వాలు ఇకనైనా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.


