అడ్డాకుల: మండలంలోని కందూర్ గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్‌ను శుక్రవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొన్ని ట్రాక్టర్లను ఉదయం స్థానిక పెద్దవాగులోకి తీసుకెళ్లి ఇసుకను నింపుతున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారని కొందరు నాయకులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. గిర్దావర్ శశికిరణ్, జీపీఓ నర్సిములు కలిసి వాగు వద్దకు వెళ్లి అక్కడే ఉన్న ఓ ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ట్రాలీలో ఇసుక లేదని కాని ఇసుక కోసమే అక్కడికి వెళ్లడంతో కార్యాలయం వద్దకు తీసుకొచ్చి జరిమానా విధించి వదిలేశామని తహసీల్దార్ శేఖర్ తెలిపారు.
మరో చోట ఇసుక డంప్
కందూర్ గ్రామానికి సమీపంలో క్రషర్‌కు ఎదురుగా ఒక చోట అక్రమంగా ఇసుకను డంప్ చేశారు. కొందరు నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రాత్రి జీపీఓ నర్సిములు అక్కడికి వెళ్లి విచారించారు. షెడ్డు నిర్మాణం కోసం ఇసుకను డంప్ చేసుకున్నట్లు రైతు చెప్పాడని ఆయన తెలిపారు. కాగా కందూర్ గ్రామంలో ఇటీవల అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలింపు వివాదాలకు కారణమవుతోంది. పట్టపగలే ఇసుక, మట్టి రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకరంటే ఒకరికి గిట్టని రాజకీయ నాయకులు ఫిర్యాదు చేస్తే తప్ప కందూర్‌లో జరిగే ఇసుక, మట్టి అక్రమ తరలింపుపై అధికారులు దృష్టి సారించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శుక్రవారం అధికారులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్, ఇసుక డంపు వ్యవహారం రాజకీయ ‘రంగు’ను బట్టబయలు చేస్తోంది. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల నుంచి రాత్రిపూట ఇసుకను అక్రమంగా నిల్వ చేసి టిప్పర్లలో నింపి పంపిస్తున్నారని కొందరు నాయకులు ఆరోపణలు చేయడం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఇప్పటికై నా అక్రమ రవాణాపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరముంది.
ఇసుక డంప్, తరలింపుపై ఫిర్యాదులు


