మోదంకుంట చెరువు ఏనుగొండ పరిధిలో జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఈ చెరువు దాదాపు 7.30 ఎకరాల్లో ఉంటుంది. ఈ చెరువుపై ఆధారపడి 220 మత్స్యకార కుటుంబాలు చేపల వృత్తిలో జీవనం సాగిస్తుండేవారు. పదేళ్లుగా ఈ చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురై మూడెకరాలకు కుచించుకుపోయింది. చెత్తను తెచ్చి ఇందులో పడేస్తున్నారు. చెరువులో నీళ్లు నిలబడటం లేదు. దీంతో మత్స్యకారుల జీవనంపై తీవ్ర ప్రభావం పడింది. ఆక్రమణలపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులిచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోకి చొరబడి యథేచ్ఛగా ఆక్రమణలు
పాతపాలమూరు ఏరియాలోని నల్లగుంట దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఒకప్పుడు ఇందులో చేపలు పెంచుకొని మత్స్యకారులు జీవనం సాగించేవారు. పదిహేనేళ్ల కాలంలో ఈ చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైంది. రియల్ వ్యాపారులు చెరువులో రాళ్లు పాతుతూ ఇప్పటికీ ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 15 ఎకరాలకు ఈ చెరువు కుచించుకుపోయింది. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఆశించిన ఫలితాలు రావడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని చెరువులను చెరబడుతున్నా సుమారు 15 నెలల క్రితం మహబూబ్‌నగర్ నమున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారడంతో రియల్ వ్యాపారుల కన్ను చెరువుశిఖం భూములపై పడింది. అధికారుల కళ్లుగప్పి హద్దులను చెరిపేసి మరీ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిని దాటి మట్టి నింపుతూ ప్లాట్లుగా మారుస్తూ రాళ్లు పాతుతున్నారు. భూముల విలువలు పెరగడంతో చెరువు భూములను టార్గెట్ చేసుకొని కొందరు అక్రమార్కులు ఆక్రమణలు కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులకు ననగర ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టింపులేదు. రియల్ వ్యాపారుల ధనదాహాన్ని రాజకీయ నాయకుల ద్వారా తీర్చుకుంటున్నారు. ఫలితంగా నగరంలోని చెరువులు కనుమరుగవుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ ఆక్రమణదారులపై చర్యలు లేకపోవడంతో చేసేది లేక ఫిర్యాదులకే పరిమితం కావడం గమనార్హం. మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలో దాదాపు 800 ఎకరాలలో 31 చెరువులు, కుంటలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. పదదమూడేళ్లలో చాలా వరకు ఆక్రమణలు కొనసాగాయి. కొన్ని చోట్ల చెరువుల ఆనవాళ్లే లేకుండాపోయాయి. హైడ్రా తరహా నిబంధనలు వస్తే తప్ప ఈ ఆక్రమణల పర్వం ఆగే పరిస్థితి లేదని స్థానికులు, ఇరిగేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బాధ్యులపై చర్యలు చేపట్టేదెన్నడో?
ఈ నిర్మాణాలన్నీ గతంలోనే చేపట్టగా జిల్లా అధికారులకు ‘ప్రజావాణి’ లో పలుసార్లు స్థానికులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. అయినప్పటికీ బాధ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
రికార్డుల్లో లోపాలే కారణం
నిజాం కాలంలో నిర్మించినఈ చెరువులు నీటి వనరుల నిల్వతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఎంతో దోహదం చేస్తాయి. అంతేకాకుండా పర్యావరణ సమతుల్యతకు ఉపయోగపడటంతో పాటు వీటిపై ఆధారపడి మత్స్యకారులు చేపల వృత్తిని కొనసాగించడం, పశువులు, ఇతర జీవాల తాగునీటి అవసరాలకు, వ్యవసాయ పంటల సాగుకు వినియోగించేందుకు చెరువులు ఉపయోగపడుతాయి. మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడే చెరువుల సంరక్షణను గాలికొదిలి భూరికార్డుల్లోని లోపాలను ఆసరా చేసుకొని రియల్ మాఫియా చెలరేగుతోంది. అక్రమంగా చెరువుల్లో మట్టి నింపుతూ ప్లాట్లు చేస్తున్నారు. చెరువు భూముల పరిరక్షణకు సరైన రికార్డులు లేకపోవడం, భూములను ఆక్రమిస్తున్న అక్రమార్కులపై చర్యలకు పటిష్టమైన నిఘా లేకపోవడం వంటి కారణాలు ప్రధాన సమస్యగా మారింది.
నిబంధనలకు నీళ్లు
చెరువు సరిహద్దు ప్రాంతంలో సొంత పట్టా భూమి ఉన్నా సరే ఇరిగేషన్‌శాఖ నుంచి ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్‌ఓసీ) తీసుకొని ఏదైనా నిర్మాణాలు చేపట్టాలి. నిబంధనలను తుంగలో తొక్కి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిని దాటి ఆక్రమణలు కొనసాగిస్తూ నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు గానీ, ఇరిగేషన్ అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
కొత్త ఆక్రమణలు ఏమీ లేవు
మహబూబ్‌నగర్ అర్బన్‌లో మొత్తం 31 చెరువులు, కుంటలున్నాయి. గతంలోనే కొన్నింటిలో ఆక్రమణలు జరిగాయి. వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్టును సమర్పించాం. కొత్తగా ఆక్రమలు ఏమీ లేవు. కొత్తగా ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.
– వెంకటయ్య, ఈఈ, నీటిపారుదల శాఖ, మహబూబ్‌నగర్ డివిజన్
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోనూ వదలని తీరు..
మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని వివిధ చెరువులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లోనూ కొందరు వ్యక్తులు ఏకంగా ఇళ్లు, ఇతర కట్టడాలు యథేచ్ఛగా చేపట్టారు.
నగరం నడిబొడ్డులోని పెద్దచెరువు (మినీ ట్యాంక్‌బండ్) 138.20 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్‌టీఎల్ పరిధిలో బీకేరెడ్డి కాలనీ, షాషాబ్‌గుట్ట, పీర్లబావి, మోటార్‌లైన్, న్యూటౌన్ కు చెందిన 78 మంది ఇళ్లు, వివిధ బహుళ అంతస్తులను అక్రమంగా నిర్మించుకున్నారు. ఇక బఫర్ జోన్‌లోనూ 64 ఇళ్లు ఇలాగే నిర్మించుకున్నారు.
శ్రీనివాసకాలనీ సమీపంలోని పాలకొండ చిన్నచెరువు 138.20 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్‌టీఎల్ పరిధిలో 56 మంది ఇళ్లు నిర్మించుకున్నారు.
బండమీదిపల్లిలోని ఇమాంసాబ్‌కుంట 23.29 ఎకరాలలో విస్తరించి ఉండగా ఇప్పటికే దీని ఎఫ్‌టీఎల్ పరిధిలో హబీబ్‌నగర్, పాత పాలమూరుకు చెందిన 14 మంది ఇళ్లు నిర్మించుకున్నారు.
గణేశ్‌నగర్, బండ్లగేరి, కిసాన్‌నగర్ మధ్యనున్న ఎర్రకుంట 29.31 ఎకరాలలో విస్తరించింది. దీని ఎఫ్‌టీఎల్ పరిధిలో 32 మంది ఇళ్లు నిర్మించుకున్నారు.
పాలకొండలోని ఊరచెరువు 19.11 ఎకరాలలో ఉండగా ఎఫ్‌టీఎల్ పరిధిలో 12 మంది పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు.
తిమ్మసానిపల్లి/దొడ్డలోనిపల్లిలోని బోసోనికుంట 5.29 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఓ ఇంటితో పాటు శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు.
బోయపల్లిలోని మల్లమ్మకుంట 14.36 ఎకరాలలో విస్తరించి ఉండగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏకంగా ఓ రైస్ మిల్లుతో పాటు మరొకరు ఇల్లు నిర్మించుకున్నారు.
ఎదిరలోని చెంచలకుంట 9.11 ఎకరాలలో విస్తరించగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఓ వ్యక్తి ప్రీకాస్ట్ కాంపౌంట్ వాల్ నిర్మించారు.
నీటి వనరుల హద్దులు చెరిపి నిర్మాణాలు చేపడుతున్న వైనం
భూముల పరిరక్షణకు సరైన రికార్డులు లేకపోవడమే కారణం
పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 31 చెరువులు, కుంటలు
హైడ్రా తరహా నిబంధనలు తెస్తే గానీ.. ఫలితం దక్కదంటున్న స్థానికులు


