హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

హత్యల కంటే రోడ్డు మరణాలే ఎక్కువ

Apr 17 2026 12:56 PM | Updated on Apr 17 2026 12:56 PM

అరైవ్‌–అలైవ్‌ అవగాహన సదస్సులోడీజీపీ శివధర్‌రెడ్డి

జడ్చర్ల: హత్యల సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళన కలిగిస్తోందని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన అరైవ్‌–అలైవ్‌ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది 800 మంది హత్యల కారణంగా మరణిస్తే 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు భద్రతకు సంబంధించి ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్‌ అలైవ్‌ ద్వారా క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. పోలీస్‌, రోడ్డు రవాణా శాఖల ద్వారానే కాకుండా అందరి భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్‌ బెక్‌లు నడిపేవారు, రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. హెల్మెట్‌ ధరించకపోవడ వల్లే ప్రమాదాలు జరిగినప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. బైక్‌ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరిగా దరించాలన్నారు. సీటు బెల్టు దరిస్తేనే ప్రమాదసమయంలో ఎయిర్‌ బెలున్లు తెరుచుకుంటాయని, ఫలితంగా ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. జాతీయ, రాష్ట్రీయ ప్రధాన రహదారులపై లారీలు, బస్సులు, తదితర భారీ వాహనాలు రోడ్డుకు ఎడమ వైపునే వెళ్లాలని సూచించారు. ఎడమ వైపు నుంచి ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయడం సరైంది కాదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షితమైన ప్రయాణం కోసం ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు బైక్‌లు, తదితర వాహనాలు నడపడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో పిల్లలను ప్రోత్సహించడం నేరమన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు జడ్చర్లలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరమన్నారు. ఎమ్మెల్యేలతో సహా ఇతర ప్రముఖల వాహనాలకు కూడా తప్పనిసరిగా నంబర్‌ప్లేట్లు ఉండాలన్నారు.జడ్చర్లలో ట్రాఫిక్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఔట్‌ పోస్టు ఏర్పాటు చేసి గంజాయి, తదితర నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించి ఎస్పీ జానకి ప్రతిజ్ఞ చేయించారు.

● మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో విదులు నిర్వర్తిస్తూ 29 ఏళ్లుగా ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు రాజేశ్వర్‌రెడ్డి, అజాజొద్దీన్‌లను సన్మానించారు. కార్యక్రమంలో డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా, రోడ్డు రవాణా శాఖ అధికారిణి శ్రీవాణి, ఏఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఆర్‌ఎం వినోద్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుష్పలత, ఎంఈఓ మంజులాదేవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement